
tamannaah shares her businessman husband photo on instagram responding over wedding rumours
సినీ సెలబ్రిటీల రీల్ లైఫ్ కన్నా వాళ్ల రియల్ లైఫ్, ఇంకా చెప్పాలంటే పర్సనల్ లైఫ్‌పై చాలామందిలో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారాలపై ఏవేవో పుకార్లు షికారు చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ పుకార్లు శృతిమించి సెలబ్రిటీలకు చిర్రెత్తుకొచ్చేలా చేసిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా తన పెళ్లిపై కొద్దిరోజులుగా షికారు చేస్తున్న పుకార్లపై సెటైరికల్‌గా స్పందించారు. తమన్నా రియాక్షన్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
తమన్నా సినిమాలు తగ్గించేయడానికి ఆమెకు పెళ్లి నిశ్చయమవడమే కారణమని కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వ్యవహారం మొత్తానికి తమన్నా దాకా చేరినట్లుంది. దీంతో తన పెళ్లి వ్యవహారంపై ఇంతలా ఆసక్తి కనబరుస్తున్నవారికి వ్యంగ్యంగా సమాధానం చెప్పాలనుకున్నట్లుంది. ఈ నేపథ్యంలో ఇతనే నా భర్త అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసేసింది. ఆ ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే.. తమన్నానే. ఆమధ్య రిలీజ్ అయిన ఎఫ్3 సినిమాలో తమన్నా కాసేపు పురుషుడిలా కనిపించారు. ఆ పాత్రకు సంబంధించిన ఫోటోనే ఇన్‌స్టాలో పోస్ట్ చేసి… ‘ఇదిగో నా బిజినెస్‌మ్యాన్ భర్తను పరిచయం చేస్తున్నాను..’ అంటూ రాసుకొచ్చారు. దానికి ‘మ్యారేజ్ రూమర్స్’, ‘ఎవ్రీ వన్ స్క్రిప్టింగ్ మై లైఫ్’ అనే హాష్ ట్యాగ్స్ జోడించారు. తమన్నా రియాక్షన్ చూసి.. హమ్మో మిల్కీ బ్యూటీ మహా ఖతర్నాక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఓ సందర్భంలో పెళ్లిపై స్పందిస్తూ తమన్నా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెళ్లంటే మన జీవితంలోకి రాబోయే వ్యక్తి మన జీవితానికి మరింత విలువను తీసుకొచ్చేవారై ఉండాలి. జీవితాన్ని మరింత అందంగా, మధురంగా మార్చగలగాలి. అది మీకు మనోహరమైన అనుభవాన్ని కలగజేస్తుంది. అందుకే పెళ్లి చేసుకోవాలి. అయితే అది కొందరికి త్వరగా జరగవచ్చు. కొందరికి ఆలస్యంగా జరగవచ్చు.’ అని తమన్నా చెప్పుకొచ్చారు.
