
polavaram project
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు పోలవరంపై అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది. ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. పోలవరం వల్ల తమ రాష్ట్రాల్లో వరద ముంపు తలెత్తుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలు చూపాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అలాగే పోలవరానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులపై ఒడిశా సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మరో పిల్ ను దాఖలు చేసింది. వీటన్నింటిపై విచరాణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు ఏమన్నదంటే?
‘పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ప్రాజెక్టును విస్తరించడం వల్ల ముంపు సమస్య పెరిగనట్లు చెప్పాయి. పర్యావరణ అనుమతులను సైతం పునఃసమీక్షించాలన్నాయి. అయితే ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర జల్‌శక్తి, పర్యావరణ శాఖలు ఒక ఉన్నతస్థాయి సమావేశం చేయాలి. తద్వారా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రులు సైతం చొరవ తీసుకొని.. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అయితే మొదట మాత్రం.. ఈ నెలలోనే కేంద్ర జల్‌శక్తి, పర్యావరణ శాఖలతో పాటు భాగస్వామ్య పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. తదుపరి విచారణ నాటికి నివేదికను సమర్పించాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 7కు వాయిదా వేసింది ధర్మాసనం.
తెలంగాణ, ఛత్తీస్ గఢ్ వాదనలు ఇలా..
తాము ప్రాజెక్టు పనులను నిలిపేయాలని కోరడం లేదని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ పేర్కొన్నారు. గోదావరిలో వరద ప్రభావం 50 లక్షల క్యూసెక్కుల వరకూ ఉంటుందని కేంద్ర అంచనా వేసినట్లు చెప్పారు. దానివల్ల ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం ఆలయం పూర్తిగా మునిగినట్లు చెప్పారు. నీరు నిలబెట్టడానికి ముందే చుట్టుపక్కల రాష్ట్రాల్లో తలెత్తే ముంపు గురించి పర్యావరణ ప్రభావ మదింపును చేయాలని కోరారు. రిజర్వాయరు నిర్మాణ పరిధిని 150 అడుగుల నుంచి 177 అడుగులకు పెంచడం వల్ల ముంపు మరింత పెరుగుతుందని ఛత్తీస్‌గఢ్ తరఫు న్యాయవాది వాదించారు.
ఒడిశా అభ్యంతరం ఇది..
సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం ఒడిశా తరఫున వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చాలా అనుమానాలు ఉన్నట్లు చెప్పారు. మొదట కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనలకు.. 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులకు.. ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు స్వరూపాన్ని గణనీయంగా మార్చినట్లు సుబ్రమణ్యం తెలిపారు. నిర్మాణానికి తగట్టు అనుమతులు పొందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది కేంద్ర ప్రాజెక్టు: ఏపీ
పోలవరం ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నది కాదని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు అని ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదించారు. ఇప్పటి వరకు రూ.20వేల కోట్లు ఖర్చు చేసినట్లు, ఇంకా రూ. 30కోట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోనిది కాబట్టి.. రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.