
AP Decentralization demand
ఉత్తరాంధ్ర పిడికిలి బిగించింది. వికేంద్రీకరణ నినాదంతో కదం తొక్కుతోంది. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ తమ గడ్డ వైపు దూసుకొస్తున్న అమరావతి రైతుల పాదయాత్రకు హెచ్చరికలు జారీ చేస్తోంది. వికేంద్రీకరణకు మద్దతుగా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల్లో వికేంద్రీకరణ పట్ల ఉన్న ఆకాంక్షను ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున చాటేందుకు ఉత్తరాంధ్ర గడ్డపై తొలి అడుగు పడింది. వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖలో జేఏసీ పురుడు పోసుకుంది. అదే సమయంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు రాజీనామా అస్త్రాలతో వికేంద్రీకరణకు అడ్డు తగలుతున్నవారికి సవాల్ విసురుతున్నారు. ఈ పరిణామాలతో ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణ అంశం ఇప్పుడు బర్నింగ్ టాపిక్‌గా మారింది.
అమరావతి పాదయాత్రకు జేఏసీ కౌంటర్ ప్లాన్ :
వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు చేపట్టిన పాదయాత్ర త్వరలో ఉత్తరాంధ్రలో ప్రవేశించనుంది. గతంలో అమరావతి-తిరుపతి పాదయాత్ర పేరిట రాయలసీమలో అలజడి రేపిన ఈ పాదయాత్ర ఇప్పుడు అమరావతి-అరసవెల్లి పాదయాత్ర పేరిట ఉత్తరాంధ్రలోనూ అలజడి రేపుతోంది. తమ ప్రాంత ప్రజల అభీష్ఠానికి వ్యతిరేకంగా తమ గడ్డ పైనే పాదయాత్రకు సిద్ధపడటాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు దుందుడుకు చర్యగా భావిస్తున్నారు. పాదయాత్రను వ్యతిరేకిస్తూ కౌంటర్ ఎటాక్‌కి సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు జేఏసీ కూడా పురుడుపోసుకుంది. అంబేడ్కర్ యూనివర్శిటీ మాజీ వైఎస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ జేఏసీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా ప్రొఫెసర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఆయా రంగాలకు చెందిన పలువురు మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా తొలి కార్యాచరణను కూడా నిర్ణయించారు. దీని ప్రకారం.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, వికేంద్రీకరణకు మద్దతుగా అక్టోబర్ 15న భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీతో వికేంద్రీకరణ పట్ల ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను చాటి చెప్పాలనుకుంటున్నారు. తద్వారా అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ఎటువంటి ప్రాధాన్యత లేదని, జనంలో మద్దతు లేదని జేఏసీ నిరూపించాలనుకుంటోంది.
రాజీనామా అస్త్రం :
జేఏసీ పురుడు పోసుకోవడమే ఆలస్యం వికేంద్రీకరణ విషయంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు దూకుడు పెంచారు. జేఏసీ ఆవిర్భావ సభలోనే వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రకటించడమే కాదు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కి అందించారు. అంతేకాదు, వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న ఉత్తరాంధ్ర టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు గట్టి సవాల్ విసిరారు. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ చేశారు. దీంతో అచ్చెన్నాయుడిని ఇరుకునపెట్టినట్లయింది. అంతకుముందు, మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉత్తరాంధ్రలో ‘అమరావతి రైతుల పాదయాత్ర’ కష్టమే..?
వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెడితే కచ్చితంగా అడ్డుకుని తీరుతామని వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ హెచ్చరించారు. ఇదివరకు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా అమరావతి పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అటు జేఏసీ కార్యాచరణ, ఇటు అధికార పార్టీ నేతల హెచ్చరికలతో అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఉత్తరాంధ్రలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.