
superstar krishna passes away mahesh babu lost three family members in 2022
టాలీవుడ్లో ఒక శకం ముగిసింది. సూపర్ స్టార్ కృష్ణ (79) మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే కృష్ణ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కృష్ణ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
కృష్ణ మరణంపై వైద్యులు ఏమన్నారంటే :
కృష్ణ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. స్వల్ప గుండెపోటు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కృష్ణ కోడలు నమత్ర ఆయన్ను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన వైద్యులు మొదట సీపీఆర్ చేశారు. అనంతరం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో కృష్ణ శరీరంలోని పలు అవయావాలు పనిచేయడం మానేశాయి. అయినప్పటికీ వైద్యులు తమవంతు ప్రయత్నం చేశారు. సోమవారం సాయంత్రం నాటికి కృష్ణ ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో ఇక చికిత్స అందించినా ఫలితం లేదని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. చివరి క్షణాల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. తెల్లవారుజామున 4.09 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్, ఎండీ డా.గురు ఎన్ రెడ్డి వెల్లడించారు.
మాటలకందని విషాదంలో మహేష్ బాబు
హీరో మహేష్ బాబుకు ఈ ఏడాది తీరని విషాదాన్ని మిగిల్చింది. నెలల వ్యవధిలోనే మహేష్ బాబు తన అన్నయ్యను, తల్లిని, తండ్రిని కోల్పోయారు. కాలేయ సంబంధిత వ్యాధితో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8న కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న కన్నుమూశారు. తాజాగా తండ్రి కృష్ణ కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబంలో ముగ్గురి వరుస మరణాలు మహేష్ బాబుకు మాటలకందని విషాదాన్ని మిగిల్చాయి.
కృష్ణ.. ఒక ట్రెండ్ సెట్టర్ :
తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. ‘అల్లూరి సీతారామరాజు’ రూపంలో మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రాన్ని అందించినా, ‘మోసగాళ్లకు మోసగాడు’గా మొట్టమొదటి కౌబాయ్ చిత్రాన్ని అందించినా, ‘సింహాసనం’గా తొలి 70 ఎంఎం సినిమాను అందించినా, ‘ఈనాడు’ రూపంలో తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమా అందించినా, ‘తెలుగు వీర లేవరా’ అంటూ తొలి డీటీఎస్ సినిమా అందించినా.. ఇవన్నీ కృష్ణకే చెల్లాయి. దాదాపు 30 ఏళ్ల పాటు ఏడాదికి పదేసి సినిమాల చొప్పున చేశారంటే ఆయనెంత బిజీ జీవితాన్ని గడిపారో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతల పాలిట దైవంగా, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా కృష్ణ అందరి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ మరణం నిజంగా మాటలకందని విషాదమే..!