
strong setback for amaravati farmers padayatra in tanuku as locals protest against the march
అమరావతి రైతుల పాదయాత్రకు జనంలో ఏపాటి మద్దతు ఉందో స్పష్టమవుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందనేది సొంత ప్రచారమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనేది తేటతెల్లమవుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు అక్కడ గట్టి నిరసన సెగ తగిలింది. ఫ్లెక్సీలు, ప్లకార్డులు, నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో స్థానికులు అమరావతి రైతుల పాదయాత్ర పట్ల నిరసన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిణామాలతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అమరావతి పాదయాత్ర అనవసర అలజడి రేపుతోందనే చర్చ జరుగుతోంది.
అమరావతి రైతుల పాదయాత్ర 30వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాదయాత్రకు వ్యతిరేకంగా, వికేంద్రీకరణకు మద్దతుగా అడుగడుగునా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు.. వికేంద్రీకరణే ముద్దు.. ఫేక్ యాత్రికులారా గో బ్యాక్ గో బ్యాక్’ అనే నినాదాలు ఫ్లెక్సీలపై కనిపించాయి. అమరావతి ముసుగులో చంద్రబాబు రియల్ దందాకు తెరలేపారని.. రాష్ట్ర సమాగ్రభివృద్ధికి వికేంద్రీకరణే సరైనదని తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో ఎక్కువ వాహనాలను కూడా మోహరించడంతో పోలీసులు సైతం యాత్రకు అడ్డుచెప్పారు. కోర్టు సూచించిన ప్రకారం కేవలం 5 వాహనాలు మాత్రమే ఉండాలని.. అలా అయితేనే యాత్రకు అనుమతిస్తామని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వారు వాగ్వాదానికి దిగారు.
‘అమరావతి రైతుల పాదయాత్ర’కు వ్యతిరేకంగా తణుకులో కనిపించిన నినాదాలు
వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు… రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులారా గో బ్యాక్ గో బ్యాక్…
హైదరాబాద్ ప్రయోగం అన్యులపాలు.. అమరావతి ప్రయోగం ‘చంద్రబాబు అడ్ కో’కే మేలు
మూడు రాజధానులకు ప్రజామోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం.. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులూ గో బ్యాక్.. గో బ్యాక్..
అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు…
జగనన్న ప్రగతి రథ సారథి… చంద్రబాబు రియల్టర్ల వారథి..
అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష… అయినవారి బాగు కోసమే వికేంద్రీకరణ పట్ల బాబు వివక్ష..
పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర పట్ల వ్యక్తమైన వ్యతిరేకతతో ప్రజల్లో ఆ యాత్రకు మద్దతు లేదనే చర్చ జరుగుతోంది. ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరేనాటికి ప్రజా వ్యతిరేకత మరింత పెల్లుబికే అవకాశం కనిపిస్తోంది. కేవలం 29 గ్రామాల డిమాండును రాష్ట్ర ప్రజలందరి మీద రుద్దడం కన్నా.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే వికేంద్రీకరణకే ప్రజలు అండగా నిలుస్తున్నారు.