
bjp
2024 ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న ‘ప్రజాపోరు’ సభలకు విశేష ఆధరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకో జిల్లా లో పర్యటిస్తూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల సభల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది భాజపా. ఈ వీధి సభల్లో ప్రభుత్వం పట్ల కనబడుతున్న ప్రజావ్యతిరేకత ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేలా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాపోరు సభల కార్యక్రమం ఇన్ఛార్జ్ ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గురువారం ఒక్కరోజే 580 ప్రజాపోరు వీధి సభలను నిర్వహించారు. శుక్రవారం కూడా అదే ఉత్సాహంతో నిర్వహిస్తున్నట్లు నాయకులు చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమువీర్రాజు రాజమహేంద్రవరంలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు శ్రీ జీవిఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ప్రజాపోరు సభల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిప్పులు కురిపిస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్ధసారధి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజులు కూడా ప్రజా పోరు సభలకు హాజరవుతున్నారు.
దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందుతున్న భారతీయ జనతా పార్టీ.. ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే బీజేపీలోని కీలక నేతలు, కేంద్ర మంత్రులు తరుచూ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజాపోరు సభలను నిర్వహిస్తోంది. ఫలితంగా బూత్ లెవల్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.