
TTD
- నవంబర్ 4న తిరుపతి శ్వేత భవన్ లో ప్రకృతి వ్యవసాయ రైతులతో టీటీడీ ప్రత్యేక సమావేశం
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లడ్డు ప్రసాదం తయారీకి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం మరో పన్నెండు రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 4వ తేదీన తిరుపతిలోని శ్వేత భవన్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులతో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన 100 మంది రైతులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా పన్నెండు రకాల వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానంవారికి అందించనుంది. లడ్డు తయారీకి రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఇక నుంచి మరో 11 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని సంకల్పించింది.
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో శనగలు పండించి గతంలో టీటీడీకి సరఫరా చేసిన రాయలసీమ, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి తొమ్మిది మంది, మిగతా జిల్లాల నుంచి ఇద్దరేసి రైతుల చొప్పున ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. రామారావు, మార్కెటింగ్ విభాగపు సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్, టీటీడీ తరపున ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి, మార్క్ ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న తదితర అధికారులు పాల్గొంటారు.
బియ్యం, కంది, మినుములు, మిరియాలు, పసుపు, ఆవాలు, బెల్లం, వేరుశనగ, సెనగ, మిరియాలు చింతపండు తదితర అన్ని రకాలు కలిపి 20 వేల మెట్రిక్ టన్నులను ఈ ఖరీఫ్, రబీ సీజన్లలో రైతు సాధికార సంస్థ టీటీడీకి సరఫరా చేయనుంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సరఫరా చేస్తూ రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ లో ఎంతో పురోగతిని సాధించింది. అదే స్పూర్తితో రాష్ట్రంలోని మరో 11 ప్రధాన ఆలయాలు రైతు సాధికార సంస్థతో ఒప్పందం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇదివరకే 5 ఆలయాలతో ఒప్పందం పూర్తి చేసుకొంది. టీటీడీ ఒప్పందంతో రైతులకు ప్రీమియం ధర చెల్లించడం వల్ల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అంతేగాక రైతులు టీటీడీకి తమ వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడాన్ని శ్రీవారి సేవగా భావిస్తూ మరింత మురిసిపోతున్నారు.
ప్రతినిత్యం శ్రీవారికి సమర్పించే 950 కేజీల పుష్పాలతో ఆగరబత్తిల తయారీ, దేశీ ఆవుల ప్రోత్సాహం, ఆయుర్వేదిక మందుల తయారీ తదితర చర్యలతో ప్రకృతి పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్న టీటీడీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు ,భక్తులకు కూడా తనవంతు సేవ చేస్తోంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతో పాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు నాణ్యమైన రసాయన రహిత ప్రసాదం, ఆహారాన్ని అందించడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది.
రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మరింత నమ్మకం, డిమాండ్ కల్పించే చర్యల్లో భాగంగా రైతులకు ఆర్గానిక్ ధ్రువీకరణ పత్రాలు అందించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా తొలి విడతగా టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రైతులకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సాధికార సంస్థ మూడు సర్టిఫికేషన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు తమ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సులువుగా మార్కెటింగ్ చేసుకొనేందుకు ఈ పీజీఎస్ ఆర్గానిక్ ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. PGS ఆర్గానిక్ సర్టిఫికెట్ల జారీ విషయంలో రైతు సాధికార సంస్థ భారత ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికేషన్ ఏజెన్సీలు CSA, SSISAT, ఏకలవ్య సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థలు సేకరించిన ప్రకృతి వ్యవసాయ శాంపిల్స్ ను దేశంలో ప్రఖ్యాతి చెందిన NABL సర్టిఫైడ్ థర్డ్ పార్టీ ల్యాబ్ లలో పరీక్షించి రసాయన రహిత ఉత్పత్తులుగా నిర్ధారణ అయిన తర్వాత మార్క్ ఫెడ్ సంస్థ టీటీడీ కోసం కొనుగోలు చేస్తుంది. రసాయన రహిత ఉత్పత్తులుగా నిర్ధారణ అయిన తర్వాత టీటీడీ దే రైతులకు కనీస మద్ధతు ధర మీద అదనంగా 10 శాతం ప్రీమియం చెల్లిస్తుంది.