
Somu veerraju on kcr brs party
ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. జాతీయ రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. ప్రస్తుతానికి పార్టీ పేరు మాత్రమే మారింది. బీఆర్ఎస్కు జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. బీఆర్ఎస్ పూర్తి ఎజెండా, ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్‌పై, కేసీఆర్ వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రాలో బీఆర్ఎస్ ఎంట్రీపై కూడా ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పలువురు ఏపీ నేతలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంట్రీని తీవ్రంగా ఖండిస్తున్నారు.
తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. గతంలో ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్‌కు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. అసలు జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో చిక్కుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని… ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదని ఎద్దేవా చేశారు.
అంతకుముందు, ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆంధ్రాలో అడుగుపెట్టాలంటే.. ముందు తెలుగు తల్లికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఏపీలో నీటి ప్రాజెక్టులపై తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రం ఏపీతోనే సఖ్యత లేని కేసీఆర్.. జాతీయ స్థాయిలో రాజకీయం ఏం చేస్తారని ప్రశ్నించారు. దోపిడీ సొమ్ముతోనే కేసీఆర్‌కు రాష్ట్రంలో ఫ్లెక్సీలు కడుతున్నారని ఆరోపించారు.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ..!
బీఆర్ఎస్గా అవతరించిన టీఆర్ఎస్ ఆంధ్రాలో కూడా పోటీ చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ గట్టి ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే పలువురు నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని.. త్వరలో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. కేసీఆర్‌కు మద్దతుగా ఏపీలో పలుచోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఆంధ్రాలో బీఆర్ఎస్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఆంధ్రాలో బీఆర్ఎస్ విస్తరణపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. బీఆర్ఎస్ ఫస్ట్ ఫోకస్ మహారాష్ట్రపై ఉండనున్నట్లు తెలుస్తోంది.