
smart meters helps in quality power supply and for transparency says cmd santosha rao
వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే ప్రక్రియపై ప్రతిపక్ష అనుకూల మీడియా గగ్గోలు పెడుతోంది. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంపై అసత్య కథనాలతో బురద జల్లుతోంది. ఈ అసత్యాలను బద్దలు కొడుతూ ప్రజలకు అసలు వాస్తవాన్ని వివరించారు ఏపీఎస్పీడీసీయల్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోష్ రావు. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై ప్రభుత్వ ఉద్దేశాన్ని, తద్వారా రైతులకు కలిగే మేలును వివరించారు.
రైతులకు మేలు చేసేలా :
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, సప్లై-వినియోగంలో పారదర్శకత, రైతులకు డిస్కంలు జవాబుదారీగా ఉండేలా చేయడం.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం ద్వారా ఈ మూడు ప్రయోజనాలు చేకూరుతాయని డిస్కంల సీఎండీలు చెబుతున్నారు. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారనేది కచ్చితంగా తెలుస్తుందని… తద్వారా అవసరమైన కెపాసిటీతో కూడిన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క పైసా చెల్లించే అవసరం ఉండదని… పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు, విద్యుత్ వినియోగానికయ్యే ఛార్జీలను నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని… అది డిస్కంలకు బదిలీ అవుతుందని పేర్కొన్నారు. తద్వారా విద్యుత్ సప్లై, వినియోగంలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. డిస్కంలు రైతులకు జవాబుదారీగా ఉంటాయని అన్నారు.
స్మార్ట్ మీటర్లతో తగ్గుతున్న నష్టాలు
కేంద్ర ప్రభుత్వం మీటర్లు మాత్రమే బిగించమని చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో దోపిడీకి పాల్పడుతోందంటూ టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంతోష్ రావు ఖండించారు. వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న ఐఆర్డీఏ పోర్టు మీటర్ల ద్వారా రీడింగ్ కష్టంగా మారిందని… అందుకే వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు అమర్చడం జరిగిందని.. తద్వారా 30 శాతం మేర విద్యుత్ ఆదా అవుతోందని, 15-20 శాతం నష్టాలు తగ్గాయని తెలిపారు. ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సర్వే రిపోర్టులో ఈ విషయం వెల్లడైందన్నారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వ్యయంపై తప్పుడు ప్రచారం..
ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కోమీటరుకు నెలకు రూ.200.96 పైసలుగా ఖరారైందని, వీటి కాలవ్యవధి ఏడున్నర సంవత్సరాలుగా పేర్కొనడం జరిగిందని సంతోష్ రావు తెలిపారు. వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్ మీటర్లు కాగా, 20శాతం మాత్రమే త్రీ ఫేజ్ మీటర్లు ఉన్నాయని.. కానీ,ఏపీలోని వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లేనని పేర్కొన్నారు. గతంలో కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో రూపొందించిన టెండర్ల అంచనాల్లో హెచ్చు, తగ్గులను పరిశీలించి వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించామన్నారు. ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ… స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.6123 కోట్లు ఖర్చు చేయబోతుందంటూ ప్రతిపక్ష అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పాత టెండర్లు రద్దు చేశామని… రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో కొత్త టెండర్ల ద్వారా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.