
iyr krishna rao
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై బీజేపీ నేత, మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని వివాదం ఇప్పటిది కాదన్నారు. 1953 నుంచి ఇది కొనసాగుతుందన్నారు. రాజాజీ, ప్రకాశం పంతులు వంటి నేతలే ఏపీకి రాజధానని నిర్ణయించలేకపోయారన్నారు.
ఆనాడు గౌతు లచ్చన్న వంటి పెద్దలు గుంటూరు లో రాజధాని పెట్టాలని నిర్ణయించారన్నారు. హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేయాలని వారు చెప్పినట్లు కృష్ణారావు పేర్కొన్నారు. ఆ తరువాత అనుకోని పరిణామాల తో ఆ నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. నేటి రాజధాని వివాదాలకు ఆది పురుషుడు చంద్రబాబు అన్నారు. మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.
చంద్రబాబు విఫలం..
ఎంతో చారిత్రక నేపథ్య ఉన్న నాలుగు ప్రాంతాలను కలుపుకుని వెళ్లడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. రాజధాని పేరుతో రైతుల భవిష్యత్తు ను పణంగా పణంగా పెట్టారన్నారు. ఒకేసారి పెద్ద రాజధాని నిర్మాణం సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు పనులు చేపట్టారన్నారు. 1953లో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదు.. 2014లో రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యిందన్నారు కృష్ణారావు.
అమరావతిని పరిపాలనా రాజధానిగా ఉంచి.. మహానగరంగా విశాఖను అభివృద్ధి చేస్తే వివాదం ఉండేది కాదన్నారు. హైకోర్టు ను కర్నూలు కు తరలించాలని.. ఇదే బీజేపీ నినాదం అన్నారు. ముంబై తరహాలో విశాఖ ను అభివృద్ధి చేయొచ్చని, అయితే దానికి రాజధానే చేయనక్కర్లేదన్నారు.
పచ్చటి కొండలను తవ్వేసి ప్లాట్లు వేసి దోచుకోవడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. పరిపాలనా రాజధాని ఉన్న ప్రాంతమే ఏపీ రాజధాని అవుతుందన్నారు కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖ లో ఉన్న ల్యాండ్ బ్యాంక్ లో పరిశ్రమ లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పని చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టడం సులువు… వాటిని నియంత్రణ చేయడం కష్టం అన్నారు.