
krishnam raju
టాలీవుడ్ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు(Krishnam Raju) కన్నుమూశారు. తెల్లవారుజామున 4గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 83ఏళ్లు కాగా.. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. ప్రభాస్ కు ఆయన స్వయాన పెదనాన్న అవుతారు. కృష్ణంరాజు మరణవార్తతో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వయోభారం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ప్రభాస్ వచ్చి.. తన పెదనాన్న ఆరోగ్యంపై వాకబు చేసినట్లు వీడియోలు బయటికి వచ్చాయి. వయోభారం వల్ల కృష్ణంరాజు ఇంటికే పరిమితం అయ్యారు. సినిమాలు కూడా తగ్గించేశారు. ఇటీవల రాధేశ్వామ్ సినిమాలో నటించారు.
1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. ముగ్గురు కుమార్తెలు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చివరిసారి రాధేశ్యామ్లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.