
assembly seats
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం విచరాణకు స్వీకరించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు చేపట్టాలని కె.పురుషోత్తమ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. విభజన జరిగి ఎనిమిదేళ్లు కావొస్తున్నా.. సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదని ఆయన వివరించారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందని పురుషోత్తం రెడ్డి తన పిటిషన్ లో చెప్పారు. చట్టంలోని సెక్షన్ 26లోనూ ఇది ఉందన్నారు. జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రావు రంజిత్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. జమ్ము కశ్మీర్లో నియోజక వర్గాల పెంపునకు వేసిన డీలిమిటేషన్ కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా పురుషోత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు జత చేసింది.
కేంద్రమే కీలకం..
అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పే సమాధానం కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో సీట్ల పెంపుపై కేంద్రం ఏం చెబుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి టీఆర్ఎస్.. సీట్ల పెంపుపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే అందుకు కేంద్రం న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాటవేస్తూ వస్తోంది. జమ్ము కశ్మీర్ లో సీట్ల పెంపుకు రాని అడ్డంకులు.. తెలుగు రాష్ట్రాల్లో పెంచడానికి ఎందుకు వస్తున్నాయనేది పిటిషనర్ వాదన. సీట్ల పెంపును కేంద్రం జాప్యం చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.