
కాకినాడ, మార్చి 19: ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు (రాక్స్) ఆర్ఎస్ రత్నాకర్ ప్రకటించారు. “ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకుండా మౌనంగా ఉండి పదవులను అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధులు చనిపోయినట్టే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి మౌనాన్ని ప్రతిఘటిస్తూ కొవ్వొత్తి వెలిగించి సంతాపం తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు నిర్ణయం – రత్నాకర్
బుధవారం కాకినాడ అంబేద్కర్ భవన్ లో విలేకరులతో సమావేశమైన రత్నాకర్, ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. “ఎటువంటి సంఖ్యా కొలమానం లేకుండా ఎస్సీ సామాజిక వర్గాలను విభజించడం తగదు. ఇది దేశవ్యాప్తంగా ఎస్సీలను అణగదొక్కేందుకు కుట్ర.” అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన రత్నాకర్, “ఈ కుట్రను చంద్రబాబు అర్థం చేసుకోవాలి. కేంద్ర స్థాయిలో ఎస్సీ కులాల మధ్య వివాదాలు రేపే కుట్ర జరుగుతోంది. దీనిని తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి గ్రహించి తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును విరమించుకోవాలి.” అని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా పోరాటం – మద్దతుగా నిలవాలని పిలుపు
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమస్య మాత్రమే కాదని, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అన్ని ఎస్సీ వర్గాలు ఈ నిరసనకు మద్దతుగా నిలవాలని రత్నాకర్ పిలుపునిచ్చారు. “ప్రత్యేక వర్గీకరణను అడ్డుకోవడం మాల సామాజిక వర్గానికి కీలకం. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించాలి” అని అన్నారు.
ఈ సమావేశంలో మాల మహానాడు కార్యకర్తలు, రాక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.