
లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో ఇప్పటికే తన సత్తా చూపిన సమంత ఈసారి యశోద పాత్రతో తెరవిందు చేస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది చదివి తెలుసుకోండి.
ఇటీవల విడుదలైన యశోద ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. శుక్రవారంథియేటర్లలోకి వచ్చి మంచి టాక్ పొందుతోంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే యాక్షన్ .. ఎమోషన్ ఉంటాయి. ఆ రెండూ కూడా ప్రేక్షకులకు ఎంత మేరకు కనెక్ట్ అయ్యాయనేది చూస్తే యశోద బాగానే మెప్పించిందనుకోవచ్చు. ఇటీవల బాగా ప్రచారం పొందిన ‘సరోగసి’ వ్యాపారం చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన కథ ఇది.
సమంత(యశోద) మురికివాడలో తన సోదరితో కలిసి నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సోదరికి ఆపరేషన్ చేయించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవడంతో యశోద ‘సరోగసి’కి ఒప్పుకొంటుంది. అయితే ఒప్పుకొన్నాక తెలుస్తుంది తానో భయంకరమైన మాఫియా కోరల్లో చిక్కుకుందని. స్థితిమంతులతో ఒప్పందం కావడంతో ఖరీదైన భవనంలో ఆమెను ఉంచుతారు. అయితే అదే తరహాలో అక్కడ ఉన్న మహిళ యశోదకి పరిచయమవుతుంది. వారి అవసరాలను మధుబాల(వరలక్ష్మి) చూస్తుంటుంది. డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్)తో యశోదకి పరిచయం ఏర్పడుతుంది. కొద్ది రోజులకే అక్కడేదో జరుగుతోందని యశోదకు అనుమానం కలుగుతుంది. సరోగసి పేరుతో తమ చుట్టూ ఏదో జరుగుతోందనే సందేహం కలుగుతుంది.
మరోవైపు శివారెడ్డి అనే వ్యాపారవేత్త తన ప్రియురాలు ఆరుషితో కలిసి కారు ప్రమాదంలో చనిపోతాడు. అది ప్రమాదం కాదని, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే విషయం బయటపడుతుంది. ఆ కేసును పరిశీలిస్తున్న కమిషనర్ బలరామ్ (మురళీశర్మ), వాసుదేవ్ (సంపత్ రాజ్) టీమ్ కు అంతుపట్టని డ్రగ్ దొరుకుతుంది. పలు దేశాల నుంచి పలువురు ధనిక కుటుంబాల మహిళలు తరచుగా ఒకే సమయంలో భారతదేశానికి వచ్చి వెళుతున్నారని పోలీసుల బృందం గుర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో ‘యశోద’ ఏం చేస్తుంది? ఆమె కనిపెట్టిన నిజాలు ఏంటి? ఆ ఊబిలోంచి బయటపడటానికి ఎలాంటి ఎత్తులు వేస్తుంది? రోడ్డు ప్రమాదమనే మర్డర్ కేసుకు .. వీరికి లింక్ ఏంటనేదే కథ. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా అల్లుకున్న కథనం ఏ మేరకు తెరకెక్కిందనేది చూసి తెలుసుకోవాల్సిందే. ఒక మాదిరి వేగంతో ప్రారంభమయ్యే కథ ఇంటర్వెల్ కి ముందు స్పీడందుకుని అనుకోని ట్విస్ట్ తో బ్రేక్ పడుతుంది. ద్వితీయార్థంలో
కూడా కాసిన్ని ట్విస్టులతో కథపై ఉత్కంఠను పెంచేస్తాడు దర్శకుడు. టీజర్ లోని పావురం సీన్ కి, కథకు సంబంధమేంటనేది సినిమాలో చక్కగా చూపించారు. మొత్తంగా యాక్టింగ్ కానీ, ట్విస్టులు కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్స్ కానీ ఏది తీసుకున్నా సమంత పూర్తి స్థాయి నటనను ప్రదర్శించిందని చెప్పవచ్చు. కామెడీ, రొమాన్స్, పాటలు లేకున్నా థ్రిల్లర్ కథాంశం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.