
సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి ప్రజా మద్దతు ఉందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వరుస విజయాలు కట్టబెట్టారని అన్నారు. అమరావతి కేవలం 29 గ్రామాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వెంచర్ అని విమర్శించారు. అది చంద్రబాబు పెట్టిన సోకాల్డ్ క్యాపిటల్ అని.. ఆచరణ సాధ్యం కానిదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దోపిడీ మార్గానికి భిన్నంగా సీఎం జగన్ మూడు ప్రాంతాల ఆకాంక్షలు నెరవేర్చేలా వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రత్యర్థులు.. దింపుడు కళ్లెం ఆశలాగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలపై తమ వాదనను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు.
గతంలో అమరావతి-తిరుపతి పాదయాత్ర ద్వారా రాయలసీమలో అలజడి రేపేందుకు ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు. ఇప్పుడు అమరావతి-అరసవెల్లి పాదయాత్ర పేరిట ఉత్తరాంధ్రలోనూ అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరిట వినిపిస్తున్నది కృత్రిమ స్వరమని.. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలంతా వికేంద్రీకరణ కోసం నినదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిధ్వనించేలా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని… అందుకు అనుగుణంగానే రాజమండ్రి, కాకినాడల్లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు జరిగాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే అమరావతి పేరిట వినిపిస్తున్న కృత్రిమ స్వరమే నిజమైనదని ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతుందన్నారు.
అమరావతి రాజధాని పేరిట 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేపట్టి.. అదే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు, టీడీపీ దోపిడీ ముఠాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. 29 గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అన్నట్లు.. అక్కడి రియల్ ఎస్టేట్ వెంచరే 5 కోట్ల ప్రజానీకం ఆకాంక్ష అన్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని.. సమన్వయంతో దాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
వైసీపీ రాజకీయ లక్ష్యం అధికార వికేంద్రీకరణ అని… అదే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏకైక మంత్రమని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాలు మద్దతునిచ్చే వైసీపీ ఆలోచనా విధానాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. వికేంద్రీకరణ అనేది అందరికీ అనుకూలమైనదని, అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మార్గమని అన్నారు. రాష్ట్ర పురోగతికై ఆరాటపడేవారంతా వికేంద్రీకరణకు అండగా నిలుస్తారని.. అలాంటి ఆలోచన కలిగినవారందరినీ ఏకం చేసి ప్రజల్లో దీనిపై చర్చ జరిగేలా చేయాలన్నారు. తద్వారా టీడీపీ దుర్మార్గపు ఎజెండాను తిప్పికొట్టవచ్చునన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరిట జరుగుతున్న దండయాత్ర విశాఖ మీదుగా అరసవెల్లి వెళ్తుందని.. ఆలోపే ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టే దండయాత్ర అనే విషయం అందరికీ తెలియాలని, ఆ దిశగా అంతా గొంతెత్తాలని అన్నారు. వైసీపీ సీనియర్ నేతలంతా దీనిపై చర్చించి కార్యాచరణ తీసుకోవాలన్నారు. వికేంద్రీకరణే రాష్ట్ర అభివృధ్దికి తారకమంత్రం.. వికేంద్రీకరణే అభ్యుదయానికి తొలిమెట్టు.. అనే ధ్యేయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇదే నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు.