
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని జగన్ సర్కార్ గట్టిగా విశ్వసిస్తోంది. ఒకేచోట రాజధాని ఏర్పాటు చేసి ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించడం కన్నా మూడు రాజధానుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలను సమాభివృద్ధి దిశగా నడిపించవచ్చునని భావిస్తోంది. గత టీడీపీ పాలకులు అమరావతిని రాజధానిగా ప్రకటించి దాన్నొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్‌గా మార్చేసిన విమర్శలు మూటగట్టుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సమాగ్రభివృద్ధి కోసం జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది. ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో పాలనా వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. మేదావుల సూచనలను పట్టించుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అమరావతి రైతుల ఆవేదన సరైనదే అవొచ్చు గానీ.. రాజధాని కోసం అక్కడ అంత డబ్బు పెట్టే పరిస్థితి లేదన్నారు. అసలు రాజధాని ఏర్పాటుకు 55 వేల ఎకరాలు అవసరమే లేదన్నారు. అక్కడి భూములను టీడీపీ నేతలతో కొనిపించి రాజధాని ప్రాంతం తన గుప్పిట్లో ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాలు రాజధానిని మార్చాలనుకుంటే మార్చుకోవచ్చునని రాజ్యాంగం కూడా దానికి ఎక్కడా అడ్డు చెప్పలేదని అన్నారు. రాష్ట్రం విడిపోయి తొమ్మిదేళ్లవుతున్నా రాజధాని ఏర్పాటు కాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటైతే టీడీపీకి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కోసం ఇప్పటికీ 100 కి.మీ వెళ్లాలా అని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు అడ్డు తగిలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇదే సమావేశంలో ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన అన్‌సైంటిఫిక్‌గా జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి రూ.2 లక్షల కోట్లతో ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిందన్నారు. కానీ రాష్ట్ర బడ్జెట్ రూ.1.60 లక్షల కోట్లు మాత్రమే ఉంటే.. రాజధాని కోసం అంత బడ్జెట్ ఖర్చు పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేవలం రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టగలిగితే విశాఖపట్నంను మరో బాంబే లాగా మార్చేందుకు అన్నివిధాలా అవకాశం ఉందన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం పాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించిందన్నారు. గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఏపీకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉందని.. అవకాశం వచ్చినప్పుడల్లా దీనిపై పార్లమెంటులోనూ గళం వినిపిస్తున్నామని చెప్పారు. కేంద్రం కాలాయాపన చేయకుండా వెంటనే ఏపీని అన్నివిధాలా ఆదుకోవాలన్నారు.