
pawan kalyan
తెలుగుదేశం అధినేత చంద్రబాబు- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. గతంలో చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు.. చంద్రబాబు చంకఎక్కడంపై నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అయితే.. పవన్ కల్యాణ్ ది రెండు నాల్కల సిద్ధాంతమని ఎత్తిపోడుస్తున్నారు.
వైజాగ్ లో జనసేన నాయకులు విధ్వంసం సృష్టించి.. పోలీసులు, ప్రభుత్వంపై నిందలు వేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ తనకు ఏదో అన్యాయం జరిగినట్లు పెడబొబ్బలు పెట్టారని, తన దత్తపుత్రుడి బాధ తట్టుకోలేని చంద్రబాబు.. హుటాహుటిన హోటల్ కు వెళ్లి పవన్ ను హత్తుకోవడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దత్తపుత్రుడు- దత్తత తండ్రి కలిసిన సందర్భంగా.. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ ను నెటిజన్లు వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ పాలన, లోకేశ్ పై పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ పై జనసేన అధినేత పదునైన మాటలతో దాడి చేశారు. చంద్రబాబును దోపిడీదారుగా అభివర్ణించారు పవన్. చంద్రబాబు అబద్ధాల కోరు అని తిట్టిపోశారు. ఒక దశలో అయితే.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తే.. ‘జనం మా అమ్మానాన్నలకు కూడా తిట్టుకుంటార’ని చాలా ఘాటుగా స్పందించారు పవన్. 2018 జూలై నుంచి నవంబర్ మధ్య చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఓసారి పరిశీలిద్దాం.
పవన్ కల్యాణ్ మాటల్లో..
- 2014లో టీడీపీకి మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా.
- చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నైతికత అనేది ఉండదు. అవినీతి ప్రతిచోటా వ్యాపించింది. కాంగ్రెస్ ప్రజల నుంచి దోచుకున్న దానికంటే చంద్రబాబు ఎక్కువ దోచుకుంటారు.
- లోకేష్ సీఎం అవుతాడనేమోనని భయంగా ఉంది. రాష్ట్రంలో భూముల దుస్థితిపై నేను ఆందోళన చెందుతున్నా.
- నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చెప్పిన ప్రతి మూడు లైన్లలో.. ఆరు అబద్ధాలున్నాయి.
- చంద్రబాబు సీఎం అయిన తర్వాత భూ కబ్జాలు సర్వసాధారణంగా మారాయి.
- వైజాగ్ లో ఎకరా రూ. కోటి విలువ చేసే.. లక్ష ఎకరాల భూమిని టీడీపీ కొల్లగొట్టింది.
- రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టడంలోనే.. చంద్రబాబు అభివృద్ధి చేసి చూపించారు.
- 14000 కి.మీ పొడవైన రోడ్లు ఎక్కడ ఉన్నాయి? టీడీపీ నేతలు వెళ్లే దారుల్లో మాత్రమే ఉన్నాయా?
- టీడీపీ హయాంలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలేవీ రాలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నా స్పందించడం లేదు.
- అమరావతిని మాత్రమే ఎందుకు అభివృద్ధి చేయాలి? ఉత్తర ఆంధ్రా ఏమవుతుంది? ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటి? రాయలసీమ అభివృద్ధి ఎలా? ఇతర ప్రాంతాలకు అన్యాయం జరిగితే తెలంగాణ తరహాలో ఉద్యమం రాదా?
ఇలాంటి అనేక వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్.. చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. అప్పట్లో బాబుగారిని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిన పవన్.. ఇప్పుడు చంద్రబాబు చంకఎక్కడం.. స్వయంగా జనసేన నేతలకే రుచించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు చంద్రబాబు, లోకేశ్ ను అన్ని మాటలు అన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఊసరవెళ్లి సైతం ఆశ్యర్యపోయేలా మాట మార్చడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏ ప్రయోజనాల కోసం.. పవన్ కలాణ్ ఇప్పుడు మళ్లీ.. చంద్రబాబు పంచన చేరారని ప్రశ్నిస్తున్నారు.