
cm jagan
విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోలీసు శాఖ కష్టనష్టాలను తెలిసి ఉన్న ప్రభుత్వంగా .. సిబ్బంది కొరతను తీర్చడానికి.. పని ఒత్తిడి తగ్గించడానికి భారీ నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ నిన్ననే జీవో కూడా జారీ చేసినట్లు జగన్ చెప్పారు. ఈ స్ధాయిలో ఇన్నివేల ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరగలేదన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం సీఎం స్వీకరించారు. అమరవీరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
“6511 పోస్టుల భర్తీలో భాగంగానే చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్ బెటాలియన్ దళాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. పోలీసు శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవవేతనం కూడా మన హయాంలోనే పెంచాం. ఈ 6511 కొత్త పోలీసు ఉద్యోగాలలో కూడా హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ పోలీసుశాఖలోనే 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే నియమించాం” – సీఎం జగన్
పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. దిశ యాప్, దిశపోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలో చేపట్టినట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ తీసుకుని పోతున్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌తో.. పోలీసు సోదరుడు తనకు తోడుగా ఉన్నాడన్న భరోసాను ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు గత మూడు సంవత్సరాలలో మెరుగుపడిందన్నారు జగన్. మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణకు పట్టే సమయం గత ప్రభుత్వ హయాంలో 2017లో 160 రోజులు పడితే.. 2018లో 164 రోజులు పట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2021లో అది 79 రోజులకు తగ్గిందన్నారు. ఈ యేడాదికి అది 42 రోజులకే ఇంకా తగ్గిన పరిస్థితులు కనిపిస్తున్నట్లు వివరించారు.
వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు..
ఆపదలో ఉన్నవారికి, నేరం సంభవించక మునుపే నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని రక్షించే కార్యక్రంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కూడా పోలీసుశాఖకు ఇవ్వబోతున్నట్లు సీఎం చెప్పారు.
“శాంతిభద్రతలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు అణగారిన సామాజిక వర్గాల భద్రత.. మనకు ఈ విషయాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలన్న సంగతి ఏ ఒక్కరూ మర్చిపోవద్దని పోలీసు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క విషయం తెలియజెప్పాలనుకుంటున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పోలీసుశాఖకు మంత్రిగా ఈరోజు ఎవరున్నారు అంటే… ఒక మెసేజ్ పంపే విధంగా ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఈ రోజు ఉన్న వనితమ్మతో పాటు అంతకుముందు ఉన్న సుచరితమ్మ ఇద్దరూ దళిత మహిళలే. ఎందుకు తెలియజేస్తున్నాను అంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అణగారిన వర్గాలకు వీరి తరపున ఎంతగా తోడుగా నిలబడుతోందో చెప్పడమే కాకుండా.. నిలబడబోతున్నామన్న సంకేతం ఇవ్వడాని కోసం చేస్తున్న చర్య అని తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతను మన భుజస్కంధాలమీద వేసుకున్నాం. అందుకనే శాంతిభద్రతల విషయంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, అణగారిన సామాజిక వర్గాల భద్రకతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత గల అంశాలని చెప్పి ఎవరూ మర్చిపోవద్దని ప్రతి పోలీసు సోదరుడికి తెలియజేస్తున్నాను.” – సీఎం జగన్
మరోవైపు పోలీసులకు సంబంధించి ఇంకా చేయవల్సినవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు సీఎం జగన్. ముఖ్యంగా పోలీసులుకు కచ్చితంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది నా మనసులో మాట అన్నారు. సిబ్బంది కొరత కారణంగా వీక్లీ ఆఫ్ అమలు కావడం లేదన్న విషయం తనకు తెలిసిందన్నారు. అందుకే వెంటనే 6511 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు. గతప్రభుత్వం హయాంలో కేవలం 2700 ఉద్యోగాలు మాత్రమే ఐదేళ్లలో ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒకేసారి 6511 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూనే.. మరో 16వేల చెల్లెమ్మల ఉద్యోగాలు మహిళా పోలీసులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే భర్తీ చేశామన్నారు.