
Former MLA Dommalapati Ramesh birthday celebrations
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయం రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తిపోయింది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన టీడీపీ శ్రేణులంతా రికార్డింగ్ డ్యాన్సులతో తరించిపోయారు. ఐటెం సాంగ్స్‌కు స్టెప్పులేస్తున్న యువతులతో కలిసి హుషారుగా చిందులేశారు. పుట్టినరోజు నాడు ఇలా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి తమను మహదానందపరిచిన నాయకుడికి జేజేలు కొట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ శుక్రవారం (అక్టోబర్ 28) పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు విషెస్ చెప్పేందుకు వచ్చే నేతలు, కార్యకర్తల కోసం టీడీపీ కార్యాలయంలోనే ఆయన రికార్డింగ్ డ్యాన్సుల ఏర్పాటు చేశారు. ఇంకేముంది పుట్టినరోజు వేడుకలకు వచ్చిన టీడీపీ శ్రేణులు రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలారు.
మదనపల్లె టీడీపీ కార్యాలయంలోనే కాదు నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లోనూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అయితే నడిరోడ్డు పైనే వేదికలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపపడ్డారు. పుట్టినరోజు వేడుకలతో ఇలా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, రికార్డింగ్ డ్యాన్సులతో రచ్చ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.