
rayalaseema industrial development
సుదీర్ఘకాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాయలసీమ.. పారిశ్రామికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రముఖ కంపెనీలు రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రాయలసీమలో 72,188 కోట్ల ప్రాజెక్టులకు అనుమతులివ్వడం.. ఈ ప్రాంత ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. నంద్యాలలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభంతో.. రాయలసీమ అడుగుకు మరో ముందడుగు వేసింది.
విస్తారంగా సున్నపురాయి నిల్వలు ఉన్న రాయలసీమలో గతంలో ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నంద్యాలలో దాదాపు 2 మిలియన్ టన్నుల క్లింకర్ కెపాసిటీతో పాటు, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ కెపాసిటీతో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ 2 మిలియన్ టన్నుల క్లింకర్ కెపాసిటీ మొత్తంగా 3 మిలియన్ టన్నుల సిమెంగ్ ఉత్పత్తి చేస్తుంది. దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాౖటైన తొలి దశ ప్లాంట్లో దాదాపు 1000 మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎలాగూ చట్టం చేశాం కాబట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి.
కర్నూలు తలపెట్టిన గ్రీన్కో ప్రాజెక్టుకు ఇటీవలే పునాది రాయి పడింది. 5400 మెగావాట్ల కెపాసిటీతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి.. పంప్ స్టోరేజీతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. తద్వారా 2600 ఉద్యోగావకాశాలు రానున్నాయి.
త్వరలో 20వేల ఉద్యోగాలు..
రాయలసీమలో ప్రధానంగా ఉద్యోగ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారానే ఉద్యోగ అవకాశాల కల్పన సాధ్యమని భావిస్తోంది. అందుకే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రీన్కో, ఇండోసాల్, ఆర్సిలర్ మిట్టల్, అరవిందో, అదానీ సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. తద్వారా మూడేళ్లలో రూ.72,188 కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరో మూడు, నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తయితే.. ఈ ప్రాంతంలోనే అక్షరాలా 20 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం రైతుల నుంచి భూములను లీజుకు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఎకరాకు రూ. 30వేల వరకు లీజు చెల్లించెందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ప్రతిపాదన ఫలించి.. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే.. రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
రూ.700 కోట్ల పెట్టుబడితో, దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అపాచీ షూ కంపెనీని చిత్తూరు, పులివెందులలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్, అదే జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ), తిరుపతి చేరువలో మరో ఈఎంసీని ఏర్పాటు చేశారు.
ఇవే కాక రాయలసీమకు మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు వరుస కట్టే అవకాశం ఉంది.