
decentralization aspiration
వికేంద్రీకరణ ఆకాంక్షను చాటేందుకు రాయలసీమ సిద్ధమవుతోంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆత్మగౌరవ మహాప్రదర్శన చేపట్టనున్నారు. రాయసీమ పౌరుషాన్ని చాటేందుకు ఆత్మగౌరవ మహాప్రదర్శనకు వేదిక కానుంది. ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేయడానికి రాయలసీమ ప్రజలు.. తిరుపతికి తరలిరావాలని భూమన కరుణాకరరెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు.
విశాఖ గర్జన విజయవంతమైన నేపథ్యంలో.. అదే స్ఫూర్తితో రాయలసీమ ప్రాంత ప్రజల ఆంకాక్షను ప్రతిబింబించేలా ఆత్మగౌరవ మహాప్రదర్శన చేయాలని రాయలసీమ నాయకులు భావిస్తున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీమ ప్రజలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నియోజకవర్గ ప్రజానీకానికి పిలుపునిచ్చారు ఎమ్మెల్యే భూమన. గడపగడపకూ వెళ్లి వికేంద్రీకరణకు మద్దతుగా నిలవాలని, ఆత్మగౌరవ మహాప్రదర్శనలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు.
తిరుపతిలో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు కృష్ణాపురం ఠాణా నుంచి తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకూ మహాప్రదర్శన చేపట్టనున్నారు. అయితే మహాప్రదర్శనకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వం వహించడం గమనార్హం.
వామపక్ష తీవ్ర ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం కరుణాకరరెడ్డికి ఉంది. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి, దేశంలోనే అతి చిన్న వయసులో జైలుకు వెళ్లారు కరుణాకరరెడ్డి. అలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ మహాప్రదర్శన చేపట్టడం ఆసక్తికర పరిణామం.