
ysr sanchara pashu arogya sevalu
సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో దూసుకెళ్తున్న ఏపీ సర్కార్ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆర్బీకే వ్యవస్థ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ బృందం ఏపీ సర్కార్ అమలుచేస్తున్న వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై ప్రశంసలు కురిపించింది. ఏపీ స్పూర్తితో పంజాబ్‌లోనూ ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది.
వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అద్భుతం : పంజాబ్ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ఏపీ పర్యటనలో భాగంగా పంజాబ్ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ ప్రతాప్ నేత్రుత్వంలోని బృందం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పశు సంచార వైద్య సేవా రథాలను పరిశీలించారు. ఆ అంబులెన్సుల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు తాము ఊహించని దాని కన్నా చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు.
ఒక్కో అంబులెన్సులో ఓ పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లోమా చేసి సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్‌ను నియమించారని పేర్కొన్నారు. 1000 కిలోల బరువున్న జీవాలను సైతం సులువుగా తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్, 20 రకాల పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు మినీ లేబోరేటరీ సౌకర్యాలు అందులో ఉన్నాయన్నారు. పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసే సౌకర్యాలు కూడా అంబులెన్సుల్లో ఉన్నాయన్నారు. రైతులు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయగానే ఈ అంబులెన్సులు నేరుగా అక్కడికి వెళ్లి సేవలందిస్తున్న తీరు అద్భుతమని ప్రశంసించారు.
ఇదే మోడల్‌ను పంజాబ్‌లోనూ అమలుచేస్తామని.. తమ రాష్ట్రంలో 22 జిల్లాలు ఉన్నాయని… ఒక్కో జిల్లాకు 3 చొప్పున అంబులెన్సులు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే ఏపీలో అమలుచేస్తున్న పశు సంచార వైద్య సేవ రథాలను పరిశీలించేందుకు వచ్చామన్నారు.
‘ఆర్బీకే వ్యవస్థపై దేశమంతా చర్చ జరుగుతోంది..’
ఏపీలో ఏర్పాటైన ఆర్బీకేలపై దేశమంతా చర్చ జరుగుతోందని పంజాబ్ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ ప్రతాప్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ చాలా దూరదృష్టితో వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్ద పీట వేస్తూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఆర్బీకేలను వన్ స్టాప్ సొల్యూషన్‌గా తీర్చిదిద్దడం అద్భతమని.. ఆ ఆలోచనే వినూత్నమని అన్నారు. పంజాబ్‌లోనూ ఆర్బీకే తరహా సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నామన్నారు.