
chandrababu naidu
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో 14 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. బాలిక ప్రతిఘటించటంతో నోట్లో, ముఖం మీద యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని చంద్రబాబు కోరారు. కఠిన శిక్షలతోనే మహిళలపై నేరాలను అదుపు చేయవచ్చునని, పోలీసులు శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలన్నారు.
ఇంట్లో ఉన్న ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తేనే ఇటువంటి నేరాలు పునరావృతం కావన్నారు చంద్రబాబు. నేరాల నియంత్రణకు పోలీసులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఉండటం వల్లే.. నేరగాళ్ల విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.