
puneeth rajkumar
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈలోకాన్ని విడిచిపోయి శనివారానికి(అక్టోబర్ 29) ఏడాది గడిచిపోయింది. దీంతో ఆయన వర్ధంతికి అభిమానులతో పాటు కర్నాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. చిన్న వయసులోనే గుండెపోటుకు గురై.. మరణించిన పునీత్ రాజ్ కుమార్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అప్పు లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పునీత్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే బెంగళూరులో తరలించనున్న ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు తెలిపారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు.
నవంబర్ 1న నిర్వహించే.. ‘కన్నడ రాజ్యోత్సవంలో పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు.
కన్నడ రాజ్యోత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్, రజినీకాంత్
‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొనేందుకు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై అహ్వానించారు. అలాగే ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం..
ఎన్టీఆర్- పునీత్ మధ్య మంచి అనుబంధం ఉంది. ‘యువరత్న’ విడుదల సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్‌ను తన సోదరుడిగా పునీత్ పేర్కొన్నారు. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమాలో ‘గెలియా గెలియా’ పాటను ఎన్టీఆర్ పాడారు.