
poster
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు తొలగించడంపై టీడీపీ, జనసేన ఆందోళనలు వైసీపీని తూర్పార పడుతుంటే.. అధికార పార్టీ సైతం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ మాకు వద్దు’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వెలసిన పోస్టర్లు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టేందుకు వైసీపీ ఆడుతున్న గేమ్ లా ఇది కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతుంటే, టీడీపీలోని రెబెల్ గ్రూప్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని మరికొందరు చెబుతున్నారు. వైస్రాయ్ కుట్ర నేపథ్యంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ అన్న మాటలను ఇప్పుడు వ్యూహాత్మకంగా వైసీపీ తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. దీని ద్వారా ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదనే విషయాన్ని బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంపై చంద్రబాబు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని రాజకీయంగా కూడా మలుచుకోవాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సందర్భంలో చంద్రబాబు.. ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తారు. వైఎస్సార్ కంటే ఎన్టీఆర్ చాలా గొప్ప అన్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో చంద్రబాబు మాటలను తిప్పి కొట్టేందుకు వైసీపీకి చెందిన నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు రంగంలోకి దిగారు. మంత్రులు ఆర్ కే రోజా, గుడివాడ అమర్నాథ్, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అంజాద్ బాషా, విడదల రజిని, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని.. తదితరులు ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు.
ఇదే సమయంలో వైస్రాయ్ కుట్ర సమయంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అప్పటి పేపర్ కటింగ్స్ ను విజయవాడ వ్యాప్తంగా అంటించారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల పనా? ఇంకెవరిదైనానా అనేది తేలాల్సి ఉంది. ఎవరు అంటించినా.. వైస్రాయ్ కుట్ర సమయంలో చంద్రబాబు- ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ పోస్టర్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదం చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకొనే విజయవాడలో ఈ పోస్టర్లు కనిపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దసరా పండగ వేళ..
విజయవాడలో దసరా పండగ వేళ.. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి సమయంలో ‘ఎన్టీఆర్ మాకు వద్దు’ అనే పోస్టర్లు నగరవ్యాప్తంగా కనిపిస్తోండటం చర్చనీయాంశమౌతోంది.
ఈ పరిణామాలు టీడీపీ మైలేజ్ ను తగ్గించే అవకాశం ఉందని, వైసీపీ ఇమేజ్ మరించే పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.