
ysrcp kapu leaders
- పవన్ కు దమ్ముంటే 175 సీట్లలో సింగిల్ గా పోటీ చేయాలి
- వైయస్సార్సీపీ కాపు ప్రజా ప్రతినిధుల సవాల్
వైయస్సార్సీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని, అన్ని పథకాలు, రంగాలలో అత్యధిక ప్రాధాన్యం కల్పించారని ఆ పార్టీ కాపు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన దాని కన్నా లక్ష రెట్లు ఎక్కువ మేలు చేశామన్నారు. మూడేళ్లలోనే కాపులకు దాదాపు రూ.27 వేల కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పారు. కాపులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వాన్ని, కాపు ఎమ్మెల్యేలను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రంగా హత్య ఘటనపైనా పవన్ కళ్యాణ్ అనైతికంగా మాట్లాడారని, రంగాను కాపులు ఎందుకు కాపాడుకోలేదని పవన్ ప్రశ్నించి, అదే రంగాను చంపించిన చంద్రబాబుతో వెంటనే భేటీ అయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కాపు సోదరులు, సామాజికవర్గం గమనించాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు కోరారు. సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన రాజకీయ పార్టీ కాదని, ఒక విధానమంటూ లేదని, అది కేవలం సెలబ్రిటీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. తమకు 10 సీట్లు ఇవ్వాలని పవన్ ఎవరినో కోరాడని, అంటే ఎవరికో పార్టీని తాకట్టు పెడుతున్నాడనే కదా అని ప్రశ్నించారు. పవన్‌ను తిట్టేందుకు తాము సమావేశం కాలేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు.
వైసీపీ ప్రభుత్వంలో కాపులకు గౌరవం: మంత్రి బొత్స
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ కాపులను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశాయని, వారిని ఉపయోగించుకుని, ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కిందని, తామంతా తృప్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో రాజకీయపరంగా గత ప్రభుత్వాల కంటే పెద్ద పీట వేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక సెలబ్రిటీ పార్టీ నేత ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడాడో.. తమ సామాజికవర్గం గురించి ఎలా మాట్లాడారో చూశామని, వాటన్నింటినీ ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
అప్పటి కంటే ఎంతో ఘనంగా: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సందర్భంగా కాపు సామాజికవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు సామాజికవర్గానికి ఏటా రూ.1000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పినా, కేవలం రూ.1824.67 కోట్లు మాత్రమే ఇచ్చారని, లబ్ధిదారులు కూడా 2,54,335 మందేనని చెప్పారు. అదే సీఎం జగన్ కాపులకు ఏటా రూ. 2 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రూ.16,485.02 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.10,004.92 కోట్లు.. మొత్తం రూ26,490.12 కోట్లు కాపు సామాజికవర్గానికి ఇచ్చారని, లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 70,83,373గా ఉందని వివరించారు. పవన్ కళ్యాణ్, ఆనాడు ఎవరైతే వారికి వెన్నుపోటు పొడిచి, అప్రతిష్టపాల్జేశారో, బురద చల్లారో.. వారితోనే స్నేహం చేస్తూ, వాళ్ల నాయకుడు చంద్రబాబుతో అంట కాగుతున్నారని దుమ్మెత్తి పోశారు. కాపు సామాజికవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ నుంచి ఎన్నికైన వారికి ఉద్దేశించి.. పవన్ అన్న మాటలు.. చెప్పు చూపించిన తీరు చూసిన తర్వాత కాపు సామాజికవర్గంలో అంతా మరోసారి రియలైజ్ అవుతున్నారని, ఆడపిల్లల తండ్రులు కూడా పవన్ వ్యాఖ్యలతో బాధ పడుతున్నారని పేర్కొన్నారు. తాను మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాను కాబట్టి, మీరూ చేసుకోండంటూ అన్న పవన్ వ్యాఖ్యలను కూడా అందరం ఖండిస్తున్నామన్నారు.
బాబు కాపులను అణిచివేశారు: అంబటి
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కాపులను అణిచేసే కార్యక్రమాలు చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే, దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు అనుసరించిన విధానం అందరికీ గుర్తుందన్నారు. ఆనాడు వైయస్సార్ నేతృత్వంలోని ప్రభుత్వం కానీ, ఇవాళ జగన్ నేతృత్వంలోని వైయస్సార్సీపీ ప్రభుత్వం కాపులకు పెద్ద పీట వేసిందన్నారు. జగన్ పరిపాలనలో 26 మంది కాపులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని ముగ్గురు ఎంపీలు, ఐదుగురు శాసన మండలి సభ్యులు, ఎంతోమంది కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేయర్లు ఉన్నారని వివరించారు. ఈ సమావేశం పవన్‌కళ్యాణ్ కోసం పెట్టింది కాదని, అయితే పవన్ మొన్న మాట్లాడిన తీరు. దానిలో చేసిన దూషణలను ముక్తకంఠంతో సమావేశం ఖండించిందని తెలిపారు.
పవన్ ఆ పుస్తకం చదవండి: దాడిశెట్టి రాజా
రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా అసహ్యంగా మాట్లాడారని, వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయిస్తే.. అలాంటి చంద్రబాబుకు, ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు మంత్రిగా ఉన్న హరిరామజోగయ్య ఒక పుస్తకం రాశారని, కావాలంటే ఆ పుస్తకం పంపిస్తాం, చదవమని కోరుతున్నామని పేర్కొన్నారు.
జగన్ కాపుల శ్రేయోభిలాషి: కన్నబాబు
మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు రాజకీయాలను కులాల మధ్య తిప్పుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా ముద్ర వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే, కాపు సామాజికవర్గం ఆయన మీద తిరగబడిందని, అందుకే 2019లో కాపు సామాజికవర్గం జగన్ వెంట నిల్చిందని, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు 5.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.