
5g launch
దేశ సాంకేతిక ప్రస్థానంలో మరో ముందడుగు పండింది. టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దిల్లీ ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ – 2022 సమ్మిట్ లో 5జీ సేవలకు ప్రధాని మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను మోదీ తిలకించారు. 5జీ సేవలకు సంబంధించిన డెమోను రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. ప్రధాని మోదీకి వివరించారు.
తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్ లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాల్లో తొలిదశలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
4జీతో పోలిస్తే 7 నుంచి 10 రెట్ల డేటా వేగం 5జీ సేవల ద్వారా వినియోగదారులు పొందనున్నారు. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ఏ సంస్థ ఎంత వెచ్చించిందంటే..?
- జియో రూ.88,078 కోట్లు
- ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు
- వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లు
దేశంపై 5జీ ఆర్థిక ప్రభావం 2035 నాటికి సుమారు రూ.36 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.