
Plans to implement jagananna vidya kanuka scheme much better with no defects
చదువు మాత్రమే పేదల జీవితాల్లో అసలైన వెలుగులు నింపుతుంది. దీన్ని ఆచరణలో చూపించేందుకు జగన్ సర్కార్ విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పేదింటి బిడ్డలు చదువుకునే సర్కారీ స్కూళ్లను నాడు నేడు పథకంతో కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దింది. జగనన్న విద్యా కానుకతో పిల్లల చదువులకు అవసరమయ్యే వస్తువులన్నీ ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఏటా రూ.వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున అమలవుతున్న ఈ పథకంలో చిన్న చిన్న లోపాలు సహజం. ఈ లోపాలను భూతద్ధంలో చూపిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇకపై అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా జగనన్న విద్యా కానుక పథకాన్ని మరింత పకడ్బందీగా, మెరుగ్గా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ
జగనన్న విద్యా కానుక పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అధికారులు అభిప్రాయ సేకరణ చేపట్టారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు మరింత నాణ్యమైన వస్తువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. యూనిఫాం, బ్యాగులు, షూ ఇలా ప్రతీ వస్తువు విషయంలో ఈసారి మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
జగనన్న విద్యా కానుకలో మార్పులు..
విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలీని పెంచే విషయాన్ని విద్యా శాఖ పరిశీలిస్తోంది.
లావుగా ఉండే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారికి సరిపడా క్లాత్ సప్లై చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
నిపుణుల సూచనల మేరకు 1-5 తరగతుల విద్యార్థులకు మీడియం సైజు బ్యాగ్, 6-10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు పంపిణీ చేయనున్నారు. గతంలో ఇచ్చిన బ్యాగుల కన్నా ఈసారి బ్యాగు వెడల్పు పెద్దగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
బ్యాగులో నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఇతరత్రా వస్తువులు పట్టేలా కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్‌తో బ్యాగ్స్‌ను డిజైన్ చేయించనున్నారు.
పిల్లల షూ సైజుల కోసం మండల స్థాయిలో ఆయా షూ కంపెనీలతో మేళాలు నిర్వహించనున్నారు. లేదా విద్యార్థులకు కూపన్లు పంపిణీ చేసి షాపుల్లో రీడీమ్ ద్వారా కొత్త షూలు పొందేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఏమాత్రం జాప్యం జరగకుండా చర్యలు
వచ్చే ఏడాది స్కూల్స్ తెరిచే సమయానికి విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. బడ్జెట్ అంచనాలను ఖరారు చేయడం, టెండర్ల ప్రక్రియ, కంపెనీల ఎంపిక, ఒప్పందం మేరకు సకాలంలో ఆయా కంపెనీలు వస్తువులను డెలివరీ చేసేలా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై విద్యా శాఖ ఇప్పటినుంచే ఫోకస్ పెట్టింది.
ఏటేటా పెరుగుతున్న బడ్జెట్
జగనన్న విద్యా కానుకకు ప్రభుత్వం ఏటేటా నిధులు పెంచుతోంది. గతంలో 2020-21లో ఈ పథకానికి రూ.648.10 కోట్లు 2021-22లో రూ.789.21 కోట్లు, 2022-23లో రూ.931.02 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది ఆ మొత్తాన్ని మరింత పెంచుతూ రూ.958.34 కోట్లు అవసరమవుతాయని విద్యా శాఖ అంచనాలు రూపొందించింది. గత ప్రభుత్వం విద్యార్థులకు కేవలం 2 జతల యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు మాత్రమే ఇచ్చేది. అది కూడా విద్యా సంవత్సరం ఆరంభమైన చాలా నెలలకు కానీ అందేది కాదు. కానీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్స్, మూడు జతల యూనిఫాం, షూలు తదితర వస్తువులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పేదింటి పిల్లల చదువుల పట్ల జగన్ సర్కార్ చూపిస్తున్న ఈ చొరవకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.