
విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో జరిగిన 35వ పుస్తక ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తకాలపై తన అభిరుచి, ప్రభావాన్ని పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పుస్తకాలు నా జీవితానికి ధైర్యం ఇచ్చాయి. పాఠ్యపుస్తకాలకు మించి చదవడం నాకు చిన్నప్పటినుంచే అలవాటు. నా జీవితాన్ని పుస్తకాలు మార్చాయి ,” అని తెలిపారు.
ఇంకా, భవిష్యత్ తరాలు సాహిత్య సంపదను కాపాడాలని యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ రచయితల నివాసాలను సాహిత్య కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
తెలుగు సాహిత్య వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు, యువతలో సాహిత్య ప్రేమను పెంపొందించేందుకు ఇది ఉపయుక్తమని పేర్కొన్నారు. “మాతృభాషపై ప్రేమ పెంచుకోవడం, తెలుగుభాష వ్యాకరణం నేర్చుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.