
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ కో ప్రాజెక్టుకు రూ.30,000 కోట్ల పెట్టుబడులు, ఇంకా పెట్టుబడులు కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు చేపట్టారని పేర్కొన్నారు.
శనివారం కర్నూలు జిల్లా గ్రీన్ కో ప్రాజెక్టు సందర్శించిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. గాలి, నీరు, సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పుకోదగినదని తెలిపారు. భవిష్యత్తులో ఇది ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుకు సంబంధించిన 45 హెక్టార్ల భూమిపై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం ఉందని, దీనిని పరిష్కరించడానికి తాను స్వయంగా వచ్చానని పవన్ అన్నారు. “ఆఫీసులో కూర్చోవడం వేరు, ఫీల్డ్‌లోకి వచ్చి చూడడం వేరు” అని వ్యాఖ్యానించారు.
గ్రీన్ ఎనర్జీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని, వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌లో మూడోవంతు అవసరాలను తీర్చగలదని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం రూ.12,000 కోట్లు ఖర్చు చేసినట్లు, ఇంకా రూ.10,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రాజెక్టుతో సంబంధిత ఏ వివాదాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
అంతేకాక, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో భూముల ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆక్రమిత భూములు, ఇంకా మిగిలి ఉన్న భూములపై పూర్తి స్థాయి పరిశీలన జరిపి, తానే స్వయంగా ఫీల్డ్‌లోకి దిగుతానని ఆయన ప్రకటించారు.