
pawan kalyan tour
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ఘటనలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పవన్ చేపట్టిన ఇప్పటం పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళగిరి పార్టీ కార్యాలయం ఇప్పటం వెళ్లేందుకు బయల్దేరిన పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి కాలినడకన ఇప్పటం బయల్దేరారు పవన్. అయితే ఉద్రిక్తతల మధ్య మంగళగిరి నుంచి ఇప్పటం చేరుకున్నారు పవన్ కల్యాణ్. కూల్చివేసిన ఇళ్లను చూసి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలో తమ పార్టీ సభకు భూమి ఇచ్చిన పాపానికి.. ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇస్తారా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా? అని ప్రశ్నించారు పవన్. ‘వైసీపీ నాయకులారా ఖబర్దార్..’ హెచ్చరించారు. ఇలాగే చేస్తే పులివెందులలో హైవే వేస్తామన్నారు. గుంతలు పూడ్చలేరు కానీ.. ఇళ్లను కూల్చుతారు అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఆగ్రహం..
వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి.. దిక్కుమాలిన పనులు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయన్నారు. ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారన్నారు. ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. 600 ఇళ్లున్న ఇప్పటంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులవీ రోడ్లు వేసే మొహాలేనా? అని దుయ్యబట్టారు. ఇప్పటం వెళ్తున్న పవన్ కల్యాణ్‌ను అడ్డుకుంటేనో, చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు.