
సోషల్ మీడియాలో ట్రెండింగ్
‘పవన్ కల్యాణ్’ ఆ పేరుకున్న క్రేజే వేరు. పవన్ వస్తున్నాడంటే అభిమానులు ఊగిపోతారు. ఆయన సభలకు లక్షలాదిగా తరలి వస్తారు. ఇదంతా ఒకెత్తయితే ‘పవన్ మాల’ మరో ఎత్తు. దేవుడి పేరుతో దీక్షధారణ చేయడం అన్ని చోట్లా కనిపిస్తుంది. మండలం రోజులపాటు కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష చేస్తారు. తాజాగా పవన్ మీద అభిమానంతో పవన్ మాలను వేసుకున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ‘పవన్ మాల’ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విజయవాడకు చెందిన అభిమానులు కొందరు పవన్ 49వ జన్మదినోత్సవం సందర్భంగా ‘పవన్ మాల’ను ధరించి దీక్ష తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా డాలర్‌తో కూడిన మాలలను, ఎర్ర కండువాలను ధరించారు. మెడలో అన్ని మతాలకు చెందిన లాకెట్లు వేసుకున్నారు. ఈ దీక్షకు కొన్ని నిబంధనలూ ప్రకటించారు. దీక్షధారులు 21 రోజులు లేదా 41 రోజులు దీక్షలో ఉండొచ్చు. దీక్ష చేపట్టినవారు మండలకాలంలో పవన్ కార్యక్రమాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తారట ఎన్నికల్లో ఆయన గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. పవన్ స్ఫూర్తితో ప్రజా సేవలోనూ నిమగ్నమవుతామంటున్నారు. గతంలో తమిళనాడులో కుష్బూ కోసం గుడి కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పవన్‌ను దేవుడిగా భావిస్తూ మాల ధరించడంపై పలు కామెంట్లు వస్తున్నాయి.