
school dropouts in ap
ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. విద్యా రంగంపై ప్రభుత్వ చర్యలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న నాడు-నేడు పథకంతో ఏపీలో సర్కారీ బడుల రూపు రేఖలే మారిపోయాయి. కేవలం స్కూళ్ల రూపు రేఖలు మార్చడమే కాదు… విద్యార్థుల చదువుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న చొరవ భేష్ అని చెప్పాలి. ప్రభుత్వ చర్యల కారణంగా ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 1,43,573 మంది డ్రాపవుట్ విద్యార్థులు మళ్లీ బడి బాట పట్టారు. ఏపీలో బడి ఈడు పిల్లలెవరూ బాల కార్మికులుగా మారకుండా, ప్రతీ పిల్లవాడు పాఠశాల విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
స్కూల్ డ్రాపవుట్స్‌ను బడి బాట పట్టించేందుకు తీసుకుంటున్న చర్యలు
స్కూల్ డ్రాపవుట్స్‌ను బడి బాట పట్టించేందుకు ఏపీ ప్రభుత్వం అద్భుతమైన మెకానిజంతో ముందుకెళ్తోంది. స్కూళ్ల నిరంతర పర్యవేక్షణ కోసం ‘కన్సిస్టెంట్ రిథమ్స్’ యాప్‌ను రూపొందించింది. ప్రతీ గ్రామంలో వలంటీర్లతో ఇంటింటికి సర్వే నిర్వహించి బడి ఈడు పిల్లలంతా స్కూల్‌కు వెళ్తున్నారో లేదో పరిశీలిస్తోంది. సర్వేతో పాటు పాఠశాల విద్యా శాఖ నుంచి సమాచారాన్ని సేకరించి స్కూల్ డ్రాపవుట్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. వారిని తిరిగి బడి బాట పట్టించేందుకు విద్యాశాఖ అధికారులతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లను పురమాయిస్తోంది. వీరంతా బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి.. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. వారికేవైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. తద్వారా బడి మానేసిన పిల్లలను తిరిగి బాట పట్టిస్తున్నారు. ఈ వివరాలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్ రిథమ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ..
పిల్లలు స్కూల్‌కు రెగ్యులర్‌గా వస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి వరుసగా మూడు రోజులు స్కూల్‌కు రాకపోతే.. గ్రామ సచివాలయ వలంటీర్లు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. ఒకవేళ అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోతే నేరుగా ఆ విద్యార్థి ఇంటికెళ్లి సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా పిల్లలు తిరిగి స్కూల్‌కు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
సంక్షేమ విద్యా అసిస్టెంట్ వారంలో ఒకరోజు తప్పనిసరిగా తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూల్ సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే, నెలలో ఒకరోజు ఏఎన్ఎం స్కూళ్లను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారంలో ఒకరోజు మహిళా పోలీస్ సైతం స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. వీరందరి పరిశీలనలో తేలిన విషయాలను కన్సిస్టెంట్ రిథమ్ యాప్‌లో నమోదు చేసి.. తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా స్కూల్ డ్రాపవుట్స్ తిరిగి బడి బాట పడుతున్నారు.