
MP GVL NarsimhaRao
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీపై జాతీయ స్థాయిలోనూ పెద్దగా ఆశలు లేని సమయంలో జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసిన బీజేపీ పెద్దగా ప్రభావం కూడా చూపలేకపోయింది. అలాంటి పార్టీ ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందంటూ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసం బీజేపీ వరుస యాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో చేపట్టిన ప్రజాసంగ్రామ తరహాలో ఏపీలోనూ యాత్రలు నిర్వహించే ప్రణాళికలు వేస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఓట్ బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ముందంజలో ఉంటే ఏపీ అన్నిరంగాల్లోనూ వెనుకబడిందని పేర్కొన్నారు. ఈ విషయాలపై రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. వైసీపీ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేనే అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జీవీఎల్ తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న బీజేపీ త్వరలో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లోనూ యాత్రలు జరపాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 5 వేల సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టిన బీజేపీ నేతలు.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024లో ఘన విజయం సాధించేలా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రారంభించిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాబోయే ఎన్నికల నాటికి 400 సీట్లు గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం లేని కారణంగా రాష్ట్రం వెనుకబడిందని.. అభివృద్ధి కోసం ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. కనుక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 5 వేలకు పైగా సమావేశాలు నిర్వహిస్తామని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. బీజేపీని విస్తరించే కార్యాచరణలో భాగంగా గతంలో గెలవని 144 స్థానాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిటనట్లు వివరించారు. ఆ జాబితాలో విశాఖపట్నం కూడా ఉందని.. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఏపీలో భవిష్యత్ బీజేపీదే అని.. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందని జీవీఎల్ అన్నారు. తెలుగు దేశం పార్టీపై కూడా జనంలో ఏమంత సానుకూలత లేదని, ఈ పరిస్థితుల్లో జనసేనతో కలిసి విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.