
AP Three capitals
అమరావతే నిలుస్తుంది… అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తాజా పలుకు. అమరావతే ఏపీకి రాజధానిగా ఉండాలి.. ఉంటుందని ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. పైగా ఇదే 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అంటున్నారు. ఓవైపు అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా ఎదురవుతున్న నిరసనలు… వికేంద్రీకరణ కోసం జరిగిన విశాఖ గర్జన.. ఇవేవీ చంద్రబాబుకు కనిపించట్లేదు. కేవలం 28 గ్రామాల ప్రజల ఆకాంక్షనే ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షగా చూపే ప్రయత్నాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. అయినప్పటికీ అమరావతే రాజధాని అంటూ చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారు.
చంద్రబాబు తాజా పలుకులు :
ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని పేర్కొంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్స్ చేశారు. ‘వెయ్యేళ్ల పాటు తెలుగు జాతి గుండెచప్పుడుగా అమరావతి నిలుస్తుందని ఆకాంక్షించామని… కానీ పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమైందని విమర్శించారు. అమరావతి అంటే 28 వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులంతా అమరావతిని గర్వకారణంగా భావించారు.. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది.. అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్..’ అంటూ ట్విట్టర్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు.
వికేంద్రీకరణ పోరు ఉధృతమవుతున్న వేళ కుట్రలు :
టీడీపీ హయాంలో అమరావతిలో రాజధాని పేరిట రైతుల నుంచి వేల ఎకరాలు కాజేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనేది జగమెరిగిన సత్యం. అలాంటిచోట రాజధాని ఏర్పాటు చేయడం కన్నా.. గత అనుభవాల దృష్ట్యా మూడు రాజధానులైతేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే రాష్ట్రంలోని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందేందుకు వికేంద్రీకరణను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలంతా విశాఖ గర్జన పేరిట నినదించారు.
రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు, శాంతియుత ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. వికేంద్రీకరణ పోరును మరింత ఉధృతం చేసే దిశగా ఉత్తరాంధ్ర కదులుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర దిశగా వస్తున్న వేళ.. రోజుకొక నియోజకవర్గంలో బంద్‌లు, రాస్తారోకోలు, శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఇలా వికేంద్రీకరణ ఉద్యమం రోజురోజుకు బలపడుతుండటంతో చంద్రబాబుకు కంటి మీద కునుకు కరువైనట్లుంది. ఎలాగైనా వికేంద్రీకరణ ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో కుట్రలకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖలో మంత్రులపై దాడి, రాజమండ్రిలో వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన సభలో పాల్గొన్నవారిపై అమరావతి పాదయాత్రికుల దాడి.. ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్లో జరిగినవేననే ఆరోపణలున్నాయి. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు, వికేంద్రీకరణ పట్ల కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.ఒక బలమైన ప్రజా ఆకాంక్షను కృత్రిమ ఉద్యమంతో, కుట్రలతో ఢీకొట్టలేరని… చంద్రబాబు ఎంత బరితెగించినా భంగపాటు తప్పదని ప్రజాస్వామికవాదులు అభిప్రాయపడుతున్నారు.