
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు దాటిపోతోంది. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఏపీ ప్రజలను కలవరపెడుతోంది. చంద్రబాబు అయితేనే రాజధాని నిర్మించగలరనే ప్రచారంతో గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు.. ఆంధ్రులకు సింగపూర్ స్థాయి అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ అదంతా వట్టి మాటలేనని తేలిపోయింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూములను సేకరించి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపినట్లు తేలిపోయింది. దీంతో జనం 2019 ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించారు. తిరుగులేని మెజారిటీతో జగన్‌కు అధికారం కట్టబెట్టారు. అసలైన ప్రజా కోణంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దూసుకెళ్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్‌లో వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని గుర్తించారు. ఆ దిశగా ముందుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ చంద్రబాబు అండ్ కో అమరావతిలోనే రాజధాని నిర్మించాలంటూ వికేంద్రీకరణకు మోకాలడ్డుతున్నారు.
వికేంద్రీకరణ మాత్రమే ఏపీలో సమతుల్య అభివృద్ధికి మార్గమని మేదావులు, ప్రజా సంఘాల నేతలు, ఆయా రంగాల నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అమరావతి రైతులు పాదయాత్ర పేరుతో వికేంద్రీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో ఇందుకు కౌంటర్‌గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లతో వికేంద్రీకరణ ప్రాధాన్యతను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఇందులో భాగంగా తాజాగా రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పలువురు మేధావులు వికేంద్రీకరణ ప్రాధాన్యతపై మాట్లాడారు.
నన్నయ యూనివర్సిటీకి చెందిన మాజీ వైఎస్ ఛాన్సలర్ జార్జి విక్టర్ ఈ సదస్సులో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సీఎం జగన్ నిర్ణయం శాస్త్రీయమైనదని పేర్కొన్నారు. చంద్రబాబు తన కోటరీకి మాత్రమే మేలు చేసే నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేసేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వికేంద్రీకరణ ద్వారా మాత్రమే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అభివృద్ధిలో సమానత్వం సాధించవచ్చునని అన్నారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను బట్టి రాజధానులను నిర్ణయించాలని.. ఏపీకి మూడు రాజధానుల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉంటే అభివృద్ధి జరగదనుకోవడం పొరపాటని అన్నారు.
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి ఏపీలో వికేంద్రీకరణ జరగాలన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టే వికేంద్రీకరణకు ఆటంకాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఉంటే జిల్లా కోర్టు రాజమండ్రిలో ఉండేదని గుర్తుచేశారు. దానివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదన్నారు.
ఇదే కాన్ఫరెన్స్‌లో మంత్రి ధర్మాన ప్రసాదరావు మూడు రాజధానుల ప్రాధాన్యతపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం కావాలనుకుంటే రాజధానిని మార్చుకోవచ్చునని… రాజ్యాంగం దీనికి అడ్డు చెప్పదని అన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణ వైపు మొగ్గుచూపిందన్నారు. గతంలో చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి కమిటీ ప్రతిపాదనలకు విరుద్దంగా ముందుకెళ్లారని మండిపడ్డారు. వికేంద్రీకరణ అంశంతో ఎన్నికలకు వెళ్లిన తమకు ప్రజలు పట్టం కట్టారని గుర్తుచేశారు. మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ భరత్ కూడా వికేంద్రీకరణపై ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా వికేంద్రీకరణ కోరుకుంటున్నారని నొక్కి చెప్పారు.