
minister jogi ramesh
- రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ ధ్వజం
చంద్రబాబు- పవన్ కల్యాణ్ కుట్ర రాజకీయాల్లో భాగంగానే.. పార్ట్- 1 రెక్కీ, పార్ట్-2 రాయి విసరడం , పార్ట్-3 ఇప్పటంలో పవన్ కల్యాణ్ పిచ్చి కూతలు.. మూడు రోజులుగా ఒక సీరియల్ లా నడుస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామంలో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది అనే దానిపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత తమ పై ఉందన్నారు. ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పనులకు అధికారులు టెండర్లు పిలవడం, గత జనవరిలోనే మార్కింగ్ ఇవ్వడం, మొదటి విడత విస్తరణ పనులు కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ప్రారంభించారంటూ ఆ గ్రామస్తులంతా స్వయంగా మీడియా ప్రతినిధులకు చెప్పారన్నారు. వాస్తవం ఇలా ఉంటే.. బ్రహ్మాండం ఏదో బద్ధలు అయినట్లు, పవన్ సభకు స్థలం ఇచ్చారనే కక్షతో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసినట్లు పవన్ కల్యాణ్ ఆరోపిస్తే.. దానికి తానా తందానా అంటూ చంద్రబాబు ట్వీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.
ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లును కూడా కూల్చిన దాఖలాలు లేవన్నారు మంత్రి జోగి రమేశ్. ఆ గ్రామంలో రోడ్డు విస్తరణలో, డ్రైనేజ్ పనుల్లో భాగంగా అడ్డం వచ్చిన చిన్నచిన్న ఆక్రమణలను, ప్రహరీ గోడలను తొలగించినట్లు చెప్పారు. ఇవిగో సాక్ష్యాలు.. అంటూ ఆక్రమణలను తొలగించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు మంత్రి.
అక్కడ ఒక కులానికో, ఒక పార్టీకో అన్యాయం జరిగినట్లు, టీడీపీ, జనసేన పార్టీ వాళ్ల ఇళ్లు కూల్చేశారని పచ్చ పత్రిక ఈనాడులో రాతలు.. పవన్ కల్యాణ్, చంద్రబాబులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇప్పటంలోని మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను పగులకొట్టి చెత్తలో పడేసినట్లు ఇష్టం వచ్చినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆ విగ్రహాలను పంచాయితీ కార్యాలయంలో భద్రంగా ఉంచడమే కాకుండా, వాటిని మళ్లీ ప్రతిష్టించడం జరుగుతుందన్నారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా రాజశేఖర రెడ్డిగారి విగ్రహం దిమ్మెను కూడా పగులగొట్టారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. వక్రీకరణలతో పవన్ కల్యాణ్, చంద్రబాబు, ఎల్లో మీడియా అండ్ కో.. ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారాలు చేస్తూ, ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
ఎన్నో ఇళ్లు కూల్చిన బాబు కూల్చివేతలు అని మాట్లాడటమా..?
ఇప్పటంలో ఏదో విధ్వంసాలు జరిగిపోయినట్లు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం మరింత ఆశ్చర్యం వేసిందన్నారు మంత్రి జోగి రమేశ్. కూల్చివేతల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాలు వస్తే.. ఎన్ని వేల ఇళ్లను కూల్చేశారో అందరికి తెలుసన్నారు.
పిచ్చి కల్యాణ్ కారుకూతలు..
ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నవిధంగా పవన్ కల్యాణ్ తీరు ఉందన్నరు మంత్రి జోగి రమేశ్. పిచ్చి కల్యాణ్ కారుకూతలు కూస్తున్నట్లు మండిపడ్డారు. ఇడుపులపాయ మీదుగా హైవే వేసేస్తానని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇప్పటం వచ్చి, మీటింగ్ లో చెప్పిన హామీని అమలు చేశావా? ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని కోతలు కోశావు కదా? ముందు వాటిని అమలు చేయాలన్నారు. పవన్ కల్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నట్లు చెప్పారు.
పవన్ పై రెక్కీ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..?
ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పవన్ కల్యాణ్ పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు మంత్రి జోగి రమేశ్. రూ. 250కోట్ల సుపారీ ఇచ్చి తనపై రెక్కీ నిర్వహించారని చెప్పడం సిగ్గుచేటన్నారు. పవన్ కల్యాణ్ కు తగ్గట్టు చంద్రబాబు నాయుడు కూడా తగుదునమ్మా అంటూ ఆ పార్టీ నాయకులు రెక్కీ అంటూ గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు.