
north andhra people outrage over pawan kalyan for opposing
విశాఖ గర్జన విజయవంతమవడంతో వికేంద్రీకరణ వ్యతిరేకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉత్తరాంధ్ర ఆకాంక్ష ఉద్యమమై పెల్లుబికడంతో వారికిప్పుడు ఊపిరి సలపట్లేదు. ఉత్తరాంధ్ర ప్రజలంతా ఏకమై విశాఖ రాజధానికై గర్జించిన రోజే కుట్రలు మొదలయ్యాయి. ఆగమేఘాల మీద విశాఖలో వాలిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ నానా హడావుడి చేశారు. జనసేన రంకెలు వికేంద్రీకరణ ఉద్యమాన్ని అపహాస్యం చేయడమే తప్ప మరొకటి కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.
అంతా చేసి.. ప్రభుత్వం పైనే కుట్ర ఆరోపణలా..?
విశాఖ గర్జన ముగించుకుని బయలుదేరిన మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్ తదితరులపై జనసేన కార్యకర్తలు విమానాశ్రయం వద్ద దాడికి పాల్పడ్డారు. దాదాపు లక్ష మందితో శాంతియుతంగా జరిగిన గర్జనలో పాల్గొన్నవారిపై ఇలా భౌతిక దాడులు జరిపి జనసేన ఏం సంకేతాలిచ్చినట్లు అనే చర్చ జరుగుతోంది. పైగా ఇది కూడా కోడి కత్తి కేసు లాంటిదేనని పవన్ పేర్కొనడం గమనార్హం. మంత్రులపై దాడి మొదలు.. ఆపై జనసేన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అనుమతి లేకపోయినా విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్ వద్దకు పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకుని నానా రచ్చ చేశారు. ఇంత చేసి… ప్రభుత్వమే విశాఖలో అలజడికి కుట్ర చేసిందని పవన్ ఆరోపించడం గమనార్హం.
ప్రజాగ్రహంతో జనవాణి రద్దు :
ఆదివారం ఉదయం విశాఖలోని పోర్టు స్టేడియం వద్ద జనసేన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రజాగ్రహంతో పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోక తప్పలేదు. అంతకుముందే, విశాఖలో శాంతిభద్రతల రీత్యా నగరాన్ని వీడాలంటూ పోలీసులు పవన్‌కు నోటీసులు ఇచ్చినప్పటికీ.. పవన్ అందుకు ససేమిరా అన్నారు. పోర్టు స్టేడియం వద్దకు భారీగా తరలివచ్చిన జనం పవన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన చేపట్టారు. దీంతో పోర్టు స్డేడియం వద్దకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన పవన్ జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
విశాఖపై మరోసారి వ్యతిరేకత బయటపెట్టిన పవన్ :
విశాఖ గర్జనకు పోటీగానో లేక అమరావతి రాజధాని ఎజెండాతోనే తాను విశాఖకు రాలేదని చెబుతూనే.. విశాఖపట్నంపై మరోసారి తన వ్యతిరేకతను పవన్ బయటపెట్టారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని.. కొత్తగా అక్కడ డెవలప్ చేసేది ఏముందని అన్నారు. పైగా శ్రీకాకుళంలో రాజధాని ఏర్పాటు చేస్తానంటే వద్దనే ధైర్యం చేయనని వ్యాఖ్యానించారు. ఓవైపు ఉత్తరాంధ్ర ప్రజలంతా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని నినదిస్తుంటే… పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎడ్డమంటే తెడ్డం అన్నట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా విశాఖ రాజధానిపై తన వైఖరి ఏంటనేది సూటిగా చెప్పలేకపోయారు పవన్. దీన్నిబట్టి విశాఖలో రాజధాని ఏర్పాటు ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదనేది మరోసారి స్పష్టమైంది.