
సీపీఎస్ రద్దు డిమాండ్‌పై ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదు. పాదయాత్రలో సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారని, దాన్ని నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సీపీఎస్‌కు బదులుగా సూచిస్తున్న జీపీఎస్ ప్రత్యామ్నాయాన్ని ఉద్యోగులు అంగీకరించడం లేదు. ఉద్యోగులను ఒప్పించడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. మరోవైపు ఉద్యోగులు వరుస ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదని విమర్శిస్తున్నారు.
టక్కర్ కమిటీ మొదలుకొని, సీఎస్, మంత్రులతో వేసిన కమిటీలకు ఉద్యోగుల ఆమోదం లభించడం లేదు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరి ఏపీలో మాత్రం రద్దు ఎందుకు చేయలేరని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. తొలుత సెప్టెంబర్ 1న సీఎంవోను ముట్టడిస్తామని చెప్పినా, ఉద్యోగుల అరెస్టులు, బైండోవర్లు, కేసులతో తేదీ మార్చుకున్నారు. ఏపీలో సీపీఎస్ అమలులోకి వచ్చిన సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా పాటించాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తమ ఆందోళనను సెప్టెంబర్ 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.
అయినప్పటికీ విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న వారిని అరెస్టులు, కేసుల పేరుతో ప్రభుత్వం వేధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సీపీఎస్ రద్దు నిరసనలకు మిగతా ఉద్యోగ సంఘాలు కూడా మద్దతిస్తున్నాయి. సీపీఎస్ రద్దు అంశంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. జగన్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతోనే ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగులపై కేసులు, అరెస్టులు సరికాది సీఎస్ కు లేఖ రాశారు. మరోవైపు సెప్టెంబర్ 1న సచివాలయంలో ఉద్యోగులు పలు రకాల నిరసనలు నిర్వహించారు.