
కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా 640 టన్నుల రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో, పవన్ కళ్యాణ్ స్వయంగా నౌకలో వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1,064 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరియు పోర్టు అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇంత భారీ అక్రమ రవాణా జరుగుతున్నా, అధికారుల అలసత్వాన్ని ఖండించారు. “రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కి నేరుగా జవాబుదారీ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఇదంతా వదిలేయడం సబబు కాదు,” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో స్టెల్లా ఎల్ పనామా అనే షిప్ పట్టుబడింది. ఈ షిప్ లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్న ఘటనపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విచారించారు.పోర్టుల నుంచి ఇలాంటి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందని, ఇది చాలా పెద్ద నెట్వర్క్ భాగమని పేర్కొన్నారు. “రేషన్ బియ్యం మాత్రమే కాదు, డ్రగ్స్, గంజాయి, లేదా ఆర్డీఎక్స్ లాంటి ప్రాణాంతక వస్తువులు స్మగ్లింగ్ చేయబడితే, అది జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Watch Here: https://x.com/PawanKalyan/status/1862456542944968916
తక్షణమే డిజిపి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి వరకు నివేదిక పంపుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్మగ్లింగ్ పై పోర్టు అధికారులు, స్థానిక నాయకులు సమర్థవంతంగా వ్యవహరించకపోతే, తదుపరి తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.