
మద్యం స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించే అవకాశం ఉందని అనుకున్నా, ఆయన గురువారం మీడియా సమావేశంలో ఆ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. తన ప్రసంగంలో తడబాటు కనిపించిన జగన్, ఎప్పటిలానే తన హయాంలో అమలు చేసిన పథకాలు, విధానాల గురించి ప్రస్తావించారు.
చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన జగన్, ముఖ్యంగా ఇసుక, బెల్టు షాపులు, సూపర్ 6, సూపర్ 7 వంటి పథకాలపై ఘాటుగా విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు నటనలో పీహెచ్డీ చేసినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేస్తూ, ‘‘ఆయన నటనకు అవార్డు ఇవ్వాల్సిందే’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఆర్థిక విధ్వంసం, అప్పుల వివాదం
జగన్ తన ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రూ.1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండానే, 2 లక్షలకు పైగా వాలంటీర్లను తొలగించారని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖల్లోకి మార్చడం అన్యాయమన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
జగన్ మాట్లాడుతూ, “ప్రభుత్వంలోకి వచ్చాక వెంటనే ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు, ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు” అని ఆరోపించారు. మెరుగైన పీఆర్సీ అని చెప్పి, ఉన్న పీఆర్సీ ఛైర్మన్‌ను తొలగించారని అన్నారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయని, ‘‘ఏ నెలలో మొదటి తారీఖున జీతాలు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
“మా హయాంలో అభివృద్ధి.. ఇప్పుడేమవుతోంది?”
జగన్ తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, “మా హయాంలో నాలుగు పోర్టులు కట్టాం, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం” అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు.