
junior college
‘నాడు- నేడు’లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సకల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు మహర్దశ పట్టనుంది. తొలి విడతలో భాగంగా నెల్లూరులో ‘నాడు- నేడు’ కార్యక్రమ అమలుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాణికలను సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.13.44 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా తమ కళాశాలల్లో అవసరమైన 9రకాల వసతులను ప్రభుత్వం కల్పించనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి విడత నెల్లూరు జిల్లాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అభివృద్ధి కోసం 22 కళాశాలలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల్లో మొత్తం 25వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. తొలి విడత పూర్తయ్యాక.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం.
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పాఠాశాలల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. తాజాగా జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు పూనుకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా స్వాగతిస్తున్నారు.