
26 ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు
ఏపీలో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటికి సరైన రవాణా సదుపాయాలు ఉన్నాయి. మరికొన్నింటికి ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుకోవాలి. ఇంకొన్ని ప్రదేశాలకైతే ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాలి. రాష్ట్రంలో ఎక్కువగా గుర్తింపు ఉన్న పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం చేపట్టాలని ఆ శాఖ నిర్ణయించింది. చారిత్రక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రోప్‌వేల నిర్మాణంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ ప్రాజెక్టులో భాగంగా రోప్‌వేల నిర్మాణం చేపట్టాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే జాతీయ రహదార్ల అభివృద్ధి సంస్థకు అనుబంధమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఎన్హెచ్ఎల్ఎంఎల్) సంస్థతో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 26 పర్యాటక ప్రాంతాలు రోప్‌వేల నిర్మాణానికి అనువైనవిగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపగా.. మరో ఆరు డీపీఆర్ తయారీ దశలో ఉన్నాయి. మిగిలిన వాటిని దశలవారీగా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి పర్వతమాల ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు చెపుతున్నారు. కోవిడ్-19 తదనంతరం పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గి ఆదాయం కుంటుపడింది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యాటక రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా ఉన్న ఏపీ కూడా భారీగా నష్టపోయింది. గత రెండేళ్లుగా పడకేసిన పర్యాటకాన్ని పట్టాలెక్కించేందుకు అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగమే పర్వతమాల ప్రాజెక్టులోని రోప్‌వేల నిర్మాణంపై ఏపీటీడీసీ ఆసక్తి చూపడానికి కారణం. రోప్‌వేల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటక శోభ వెల్లివిరుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా త్వరితగతిన రోప్‌వేల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.