
nara lokesh
రాష్ట్రానికి మూడు రాజధానులు అని సీఎం జగన్ అంటున్నారు కానీ ఆయన చేసింది 4 రాజధానులని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నాలుగో రాజధాని నెల్లూరు అని, నెల్లూరుని క్రైం క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఎద్దేవా చేశారు. మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, పోలీసుల హింసకి నెల్లూరు రాజధానిగా మారిందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మర్డర్లు, అత్యాచారాలు, భూకబ్జాలు, పోలీసుల హింస వెనుక ఉన్నది వైసిపి నేతలేనని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన మొదటి రోజునుండే దళితులపై దాడులు మొదలయ్యాయని ఆరోపించారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టించి, ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. దళితుల అభివృద్ధి కోసం ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారన్నారు లోకేష్. ఈ పాలనలో దళితులకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రశ్నించిన వారికి పిచ్చోళ్లనే ముద్ర వేసి వేధించి చంపేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం పోరాడటానికి లేదు, నిందితుల్ని శిక్షించరని, వారిచ్చిన డబ్బు తీసుకుని నోరు మూసుకోవాలని మండిపడ్డారు లోకేష్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది ఇదేనన్నారు. ఇక క్రైం క్యాపిటల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయన్నారు. కావలిలో ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు కరుణాకర్ అధికార పార్టీ నేతల వేధింపులకు బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లు వేధించారన్నారు. దాదాపు 20 లక్షలు అప్పైయ్యిందని వివరించారు. చివరికి వేధింపులు తట్టుకోలేక కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల వేధింపుల కారణంగా కరుణాకర్ కుటుంబం ఇప్పుడు వీధిన పడిందన్నారు. కరుణాకర్ కి ఇద్దురు ఆడ బిడ్డలు, భార్య, తల్లికి అండ లేకుండా పోయిందని తెలిపారు. కరుణాకర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ భరోసానిచ్చారు.