
akkineni nagarjuna
- వైసీపీ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారం
అగ్రహీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున విజయవాడ లోక్ సభకు పోటీ చేయబోతున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన బెజవాడ నుంచి బరిలో దిగనున్నారా? అధికార వైఎస్సార్సీపీ తరఫున పోటీకి సై అంటున్నారా? పార్టీ నుంచి ఆ మేరకు హామీ వచ్చిందా? సోషల్ మీడియాలో రెండు రోజులుగా జరుగుతున్న చర్చ నిజమేనా? అసలేం జరుగుతోంది?
టాలీవుడ్లో టాప్ హీరోగా నాగార్జునకు పలు వ్యాపారాలు ఉన్నాయి. స్టూడియో అధినేతగా.. బిగ్ బాస్ హోస్ట్‌గా.. పక్కా వ్యాపారవేత్తగా సీనియర్ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున తనదైన పేరు తెచ్చుకున్నారు. తన వారసులను కూడా తెలుగు తెరకు పరిచయం చేసి మంచి సక్సెస్ లే సాధించారు. ఇలా అన్నిరంగాల్లో పేరు తెచ్చుకున్న కింగ్ నాగార్జున రాజకీయాలకు మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎంతోమంది నటులు రాజకీయ అరంగేట్రం చేసినా నాగార్జున మాత్రం ఆ విషయంలో మాత్రం ముందడుగు వేయలేదు. అలాంటి నాగ్ ఇప్పుడు విజయవాడ ఎంపీ సీట్లో పోటీ చేస్తున్నారనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి నాగార్జున రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది.
విజయవాడ ఎంపీగా కూడా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు. ప్రచారం ప్రకారం నాగార్జున వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ టిక్కెట్టు ఇచ్చి పోటీకి దింపాలని వైఎస్సార్సీపీ భావిస్తున్నట్లు సమాచారంగా ఉంది. ఈ విషయంలో అధికారిక ప్రకటనలు కానీ, నాయకుల స్టేట్ మెంట్లు కానీ లేవు. అన్ని పార్టీలతో సఖ్యతగా ఉండే నాగార్జునకు వైసీపీ మరికాస్త దగ్గర అనేది నిజమే. ఆయన కుటుంబం రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాకపోయినా.. వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారనేది బహిరంగ రహస్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాల యాడ్ లలో నాగార్జున కనిపించారు.
ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి టికెట్ల వివాదం నడుస్తున్న సమయంలో నేరుగా వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు నాగార్జున. పాత పరిచయంతో వచ్చి కలిశానని, భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని పైకి చెప్పినా.. రాజకీయ అంశాలూ చర్చకు వచ్చుంటాయనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచే విజయవాడ ఎంపీ సీటుపై ఆఫర్ ఇచ్చారని, దానిపై నాగార్జున కూడా ఆలోచిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు నాగార్జున ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు బిగ్ బాస్ తెలుగు షోను నిర్వహిస్తున్న నాగ్ బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైనా మంత్రి పదవి వచ్చే వరకు రోజా జబర్దస్త్ షోలు చేయలేదా అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. కనుక ఎంపీగా ఎన్నికైనా సినిమాలు, షోలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ అభిమాన సంఘాల నుంచి కానీ, ఇటు పార్టీ నుంచి కానీ ఎలాంటి ప్రకటనా ఇప్పటి వరకు రాలేదు.