
పచ్చటి ప్రకృతి సోయగాలతో అలరారే విశాఖ కాలుష్యం బారిన పడుతుండటంపై పర్యావరణ వేత్తలు, పర్యాటక ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) తాజాగా కాలుష్య నగరాల జాబితా విడుదల చేసింది.జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కతిహార్‌లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగా, ఢిల్లీలో 354, నోయిడాలో 328, ఘజియాబాద్‌లో 304 పాయింట్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిహార్‌లోని బెగుసరాయ్, హర్యానాలోని బల్లాబ్‌గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కూడా కాలుష్య కారక నగరాల జాబితాలో చేరాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నగరాల్లో..
ఇక ఆంధ్రప్రదేశ్ లో విశాఖతోపాటు అనంతపురం, తిరుపతి, ఏలూరు కూడా జాబితాలో చేరాయి. హైదరాబాద్‌లో గాలిలో నాణ్యత 100 పాయింట్లుగా నమోదైనట్లు జాబితా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణం, హైదరాబాద్ కూడా కాలుష్య నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్టణంలో గాలిలో నాణ్యత 202 పాయింట్లుగా ఉండగా, హైదరాబాద్‌లో 100 పాయింట్లు ఉంది. ఇక అనంతపురం (145), తిరుపతి (95), ఏలూరు (61)కూడా ఈ జాబితాలో చేరాయి.