
• సీఎం జగన్ చొరవతో ఒకే పరిధిలో వ్యవసాయం, మార్కెటింగ్, వేర్ హౌసింగ్, ఉద్యాన శాఖలు
• వేర్ హౌసింగ్ ఆన్ లైన్ సిస్టం సాప్ట్ వేర్ ను ఆవిష్కరించిన మంత్రి కాకాణి
• WDRA రిజిస్ట్రేషన్లలో రాష్ట్రానికి 3వ స్థానం సాధించినందుకు ఉద్యోగులకు అభినందనలు తెలిపిన మంత్రి
గతంలో గోడౌన్ లలో కేవలం ఎరువులు మాత్రమే లభించేవని, కానీ ఈ ప్రభుత్వంలో విత్తనం నుండి పంట విక్రయం వరకూ అన్ని సేవలు రైతు గడప వద్దనే అందిస్తున్నామని వ్యవసాయ, కో-ఆపరేషన్ మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఎప్పటికీ ఉండేవారు ఉద్యోగులు మాత్రమేనని.. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు కృషి చేయాలని మంగళవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. గతంలో వ్యవసాయం, మార్కెటింగ్, వేర్ హౌసింగ్, ఉద్యాన శాఖలకు వేర్వేరు మంత్రులు ఉండేవారని.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్ లో జరిగిన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన మొదటి రాష్ట్రస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ ఆన్ లైన్ సిస్టం (APWOS) సాప్ట్ వేర్ ను ఆవిష్కరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 1958వ సంవత్సరంలో ఏర్పాటైందని, కాలానుగుణముగా వచ్చిన మార్పులు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేర్పులు చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తోందని మంత్రి కాకాణి అన్నారు. మార్కెట్ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గిడ్డంగుల నిర్మాణం చేపట్టామన్నారు. సిబ్బందికి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో శిక్షణ కల్పించి గిడ్డంగుల సేవలలో మెరుగైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు.
ఫ్లిప్ కార్ట్ తో మార్క్ ఫెడ్ ఒప్పందం
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మార్క్ ఫెడ్ లో కూడా ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని రైతులకు, వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిడ్డంగుల సంస్థకి వ్యాపారం ఇచ్చే సంస్థలలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఎఫ్సీఐ, మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వరంగ సంస్థలలోనే స్టోరేజి స్పేస్ ని మొదటి ప్రాధాన్యతగా వినియోగించాలన్నారు. వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ & రెగ్యులేటరీ అథారిటీ (WDRA) రిజిస్ట్రేషన్ లలో రాష్ట్రానికి దేశంలో 3వ స్థానం లభించడంతో ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. గిడ్డంగుల సంస్థకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనవంతు సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని, జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. వేర్ హౌసింగ్ సంస్థ కూడా దేశంలో నెంబర్ వన్ సాధించాలని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆకాక్షించారు.
రైతులకు హామీ లేని రుణాలు
సంస్థ ఛైర్మన్ షేక్ అమీన్ కరిముల్లా మాట్లాడుతూ.. గిడ్డంగులలో రైతులు సరుకు నిల్వ చేసుకున్నప్పుడు వేర్ హౌస్ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రశీదు జారీ చేస్తామని, దీనిపై 70 శాతం వరకూ రైతులు హామిలేని ఋణం బ్యాంకు నుండి పొందవచ్చని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్ లు అన్నీ వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ & రెగ్యులేటరీ అథారిటీ (WDRA) రిజిస్ట్రేషన్ లలో రాష్ట్రానికి దేశంలో 3వ స్థానం లభించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గత 3 సంవత్సరాలలో 2019 – 20 సంవత్సరానికి గాను రూ. 19 కోట్లు, 2020 – 21 సంవత్సరానికి గాను రూ. 27 కోట్లు, 2021 – 22 సంవత్సరానికి గాను రూ. 33 కోట్లు లాభాలను గడించిందని తెలిపారు.
భారతదేశంలో వేర్ హోసింగ్ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CWC ప్రాంతీయ అధికారి అజయ్ జాదూ ఈ సమావేశములో పీపీటీ సమర్పించారు.