
pawan kalyan and cbn should answer to people why they opposing vizag as capital
విశాఖ గర్జనకు అంతా సిద్ధమైంది. ఉత్తరాంధ్ర వికేంద్రీకరణ ఆకాంక్షను చాటి చెప్పేలా రాజకీయాలకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరోవైపు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేనలు కూడా పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టనున్నాయి. విశాఖ గర్జనకు సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ.. అదేరోజు జనసేన, టీడీపీ కార్యక్రమాలు చేపట్టడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆ రెండు పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపటి (అక్టోబర్ 15) విశాఖ గర్జన ర్యాలీ అందరి కళ్లు తెరిపిస్తుందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో వికేంద్రీకరణను వ్యతిరేకించడం సరికాదన్నారు. అసలు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు విశాఖలో రాజధానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంకు ఏ అర్హత లేదని రాజధానిగా వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడ్డారు. ముంబైని తలదన్నే రాజధానిని విశాఖలో నిర్మించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు.
ఉత్తరాంధ్రలో ఉండి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలను ద్రోహులుగా జనంలో నిలబెడుతామని తెలిపారు. వికేంద్రీకరణ డిమాండ్ కేవలం వైసీపీ రాజకీయ డిమాండ్ అనే విమర్శలను కొట్టిపారేశారు. అమరావతి పేరిట చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడంటూ విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పాదయాత్ర సమయంలోనే సీఎం జగన్ వికేంద్రీకరణ గురించి చెప్పారని… అందులో భాగంగానే గ్రామ సచివాలయాలు, ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
విశాఖ గర్జన ర్యాలీ నేపథ్యంలో భారీ బందోబస్తు
విశాఖ గర్జన ర్యాలీ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ర్యాలీ జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని… వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మార్గంలో ఆసుపత్రులు ఉన్నందునా.. అంబులెన్సులకు మాత్రం మినహాయింపునిచ్చినట్లు చెప్పారు. ర్యాలీలో దాదాపు లక్ష మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అదే రోజు జనసేన, టీడీపీ కార్యక్రమాలు కూడా ఉండటంతో.. ఆ పార్టీల నేతలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.