
• విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు చర్యలు
• అన్ని యూనివర్సిటీల్లో పారదర్శకంగా ఖాళీల భర్తీకి సీఎం ఆదేశాలు
• ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి
మూడున్నరేళ్లుగా విద్యావ్యవస్థలో.. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, యువతను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సిటిజన్లుగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ మూడేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, తీసుకున్న చర్యలు, నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి చేస్తున్న కృషి ఇంతవరకూ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం చేయలేదన్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వం మీద పనిగట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు, విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం..
2018లో అప్పటి ప్రభుత్వం హడావిడిగా యూజీసీ నిబంధనలకు భిన్నంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్లు, గైడ్ లైన్స్ ను పాటించకుండా యూనివర్సిటీల ద్వారా 2,000 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్ లో చాలా లొసుగులున్నాయన్నారు. రూల్స్ ను ఉల్లంఘిస్తూ రిక్రూట్ మెంట్ విషయంలో రేషనలైజేషన్, రోస్టర్ పాయింట్లు పాటించలేదనే వివిధ అంశాల మీద 70 కోర్టు కేసులు వేశారన్నారు. రేషనలైజేషన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ పొజిషన్స్ పూర్తి అసంబద్ధంగా ఉండటంతో చాలా వరకు సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.

త్వరలో 3000 పోస్టుల భర్తీ
ఈ క్రమంలో 2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సమీక్ష చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి 2,000 పోస్టులకు అదనంగా మరో 1,000 పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ద్వారా 3,000 అసిస్టెంట్ ప్రొఫెసర్ ల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామన్నారు. గత 15 యేళ్లుగా యూనివర్సిటీల్లో ఏ విధమైన రిక్రూట్ మెంట్లు జరగకపోగా పలువురు పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని యూనివర్సిటీల్లో పారదర్శకంగా ఖాళీలు భర్తీ చేయమని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐఐఐటీలను తీసుకురావడం జరిగిందని, గత ప్రభుత్వంలో శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీల్లో ఎలాంటి బడ్జెట్ లు కేటాయించకుండా అక్కడి విద్యార్థులను నూజివీడు, ఇడుపులపాయ ఐఐఐటీల్లో పరీక్షలు రాయించిన దుస్థితి నెలకొందన్నారు. అంతేగాకుండా ఏ విధమైన పరిపాలన, ఆర్థిక అనుమతులు లేకుండా రూ.450 కోట్లకు బిల్డింగ్ టెండర్లను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళంలో క్లాసులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం చేశారన్నారు. ఒంగోలు క్యాంపస్ కు రూ.1,206 కోట్లతో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే సంబంధిత పనులు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే 9,000 ల్యాప్ టాప్ లు విద్యార్థులకు అందించడం జరిగిందని, త్వరలో మరో 6 వేల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూనివర్సిటీ నిధులను ప్రభుత్వం లాగేసుకుంటుందని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల రాష్ట్రంలో నాక్ గుర్తింపు కాలేజీల సంఖ్య పెరగిందని వివరాలు వెల్లడించారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన విద్యా ప్రమాణాలు పాటించడం వల్ల దేశంలోనే ఉమెన్ గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెరగడం అభినందనీయమని హేమచంద్రారెడ్డి అన్నారు.
వర్సిటీ నిధులు పసుపు కుంకుమకు
సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) కి చెందిన రూ.180 కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రూ.150 కోట్లు, అదే విధంగా వివిధ యూనివర్సిటీల నిధులను పసుపు-కుంకుమ కార్యక్రమానికి మళ్లించిందని, ఇప్పటివరకు వాటికి సంబంధించి లెక్కలు లేవన్నారు. ఈ ప్రభుత్వం యూనివర్సిటీలో మిగిలిన నిధులను మాత్రమే ఎక్కువ వడ్డీకి రిజిస్ట్రార్ పేరు మీదుగా ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేయడం జరిగిందని సాంబశివారెడ్డి అన్నారు.