
టీడీపీకి దూరమైన కీలక బీసీ నేత | లోకేష్‌కు భారీ ఎదురు దెబ్బ | గంజి పయనం ఎటు?
రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పోటీ చేసే స్థానం అది. 2019 ఎన్నికల్లో పరాజయం పాలైన లోకేష్ మళ్లీ ఎన్నికల వరకు ఆగకుండా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ప్రజల నాయకుడుగా పేరు పొందిన ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని ఢీకొట్టేందుకు సర్వశక్తులు కూడదీసుకుంటున్నారు.
అందని ద్రాక్షగా విజయం
మంగళగిరిలో విజయం టీడీపీకి అందని ద్రాక్షగా ఉంది. ఎలాగైనా గెలవాలని 2014, 19 ఎన్నికల్లో విశ్వప్రయత్నాలు చేశారు. 2014లో బీసీ నేత గంజి చిరంజీవిపై స్వల్ప మెజారిటీ 12 ఓట్ల తేడాతో ఆళ్ల గెలుపొందారు. అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఆ మార్జిన్ భారీగా మారిపోయింది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తనయుడు, లోకేష్ పోటీ చేయడం, అందుకోసం భారీగా ఖర్చు చేయడం కలిసొస్తాయని భావించారు. కానీ 5337 ఓట్ల తేడాతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల విజయం సాధించారు.
వరుసగా వీడుతున్న నేతలు
మంగళగిరిలో టీడీపీకి బలమైన నేతల అవసరం ఎప్పుడూ తీరడం లేదు. గతంలో మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల వంటి వారు పార్టీలో చేరి, మళ్లీ వీడారు. తాజాగా బీసీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి పార్టీకి దూరమయ్యారు. పార్టీకి ఎంత సేవ చేసినా, గుర్తింపు లేదని విమర్శించారు. గతంలో దాదాపు విజయం వరకు వెళ్లి, 12 ఓట్లతో ఓడిన చరిత్ర గంజికి ఉంది. టీడీపీకి రాజీనామా చేసిన చిరంజీవి పయనమెటు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. 2019 ఎన్నికల నుంచి కాలికి బలపం కట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్‌కు గంజి పార్టీ వీడటం పెద్ద షాకే. ఆ లోటును ఏ విధంగా పూడ్చుకుంటారో, బీసీలను ఎలా దగ్గరకు చేర్చుకుంటారో చూడాలి.